పుణ్య స్నానానికి పోతే పెద్దపులి అచ్చె

పుణ్య స్నానానికి పోతే పెద్దపులి అచ్చె

దహెగాం, వెలుగు: కార్తీక మాసం సందర్భంగా సాయంత్రం వేళ ఊరి సమీపంలోని వాగులో పుణ్య స్నానం చేసేందుకు వెళ్లిన 30 మంది పెద్ద పులిని చూసి హడలిపోయారు. ఓ వైపు చలి.. చుట్టూ చీకటి.. ఎదురుగా పులిని చూస్తూ 5 గంటల పాటు బిక్కుబిక్కుమన్నారు. బాధితుల వివరాల ప్రకారం.. కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా దహేగాం మండలం చిన్నరాస్పల్లికి చెందిన 30 మంది  గురువారం సాయంత్రం కాలి నడకన కార్తీక పుణ్య స్నానం చేసేందుకు అమరగొండ, లోహ గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు, ఎర్రవాగు సంగమ ప్రదేశానికి వెళ్లారు. అంతా వాగులోకి దిగి స్నానం చేశారు. ఒడ్డుకు వచ్చి బయలుదేరుదాం అనుకున్న టైంలో ఓ గాండ్రింపు వినిపించింది. చుట్టూ చూడగా చెట్ల మధ్య పెద్దపులి కనిపించింది. ఎంతసేపు చూసినా పులి అక్కడి నుంచి కదలలేదు. ముందుకెళ్తే ఎక్కడ పైన పడుతుందోనని భయపడిపోయిన జనం చప్పుడు చేయకుండా అంతా ఒకేచోట కూర్చుండిపోయారు. గ్రామస్తులకు ఫోన్​చేసి పులి విషయం చెప్పారు. ఎస్సై రఘుపతి గ్రామస్తులతో కలిసి ఎడ్లబండ్లలో కాగడాల వెలిగించుకుని, డప్పులు వాయిస్తూ 30 మందిని తీసుకొచ్చారు. బాధితులు పోలీసులకు థ్యాంక్స్​ చెప్పారు.