ప్రకృతిలో మనం ‘వ్యర్థం’గా భావించే ప్రతి పదార్థంలోనూ ఒక సామాజిక ఉపయోగం, ఆర్థిక అవకాశం, శాస్త్రీయ భవిష్యత్తు దాగి ఉంటుందని ఆధునిక విజ్ఞానం నిరూపిస్తోంది. నేటి ప్రపంచంలో అభివృద్ధి అంటే కేవలం భారీ భవనాలు, యంత్రాలు, పెట్టుబడులు మాత్రమే కాదు. ప్రకృతిలో వృథాగా పోతున్న వనరులను సమాజ ప్రయోజనాలకు మలచగలిగే సామర్థ్యమే అసలైన ప్రగతి.
ఈ నేపథ్యంలో చేపల వ్యర్థాలపై వెలువడుతున్న తాజా శాస్త్రీయ పరిశోధనలు మత్స్యకార సమాజానికి కొత్త దిశను చూపుతున్నాయి. ఇప్పటివరకు చేప పొలుసులు, చర్మం, ఎముకలు, అంతర్గత వ్యర్థాలను మార్కెట్ల వద్ద పారేసి కాలుష్యానికి కారణమవుతున్న పదార్థాలుగానే చూశాం. కానీ నేడు ఇవే వ్యర్థాలు వైద్యరంగంలో కీలక ముడిసరుకులుగా మారుతున్నాయి. చేపల నుంచి సేకరించే కొలాజెన్, హైడ్రాక్సీ అపటైట్ వంటి పదార్థాలు చర్మ చికిత్సలు, ఎముకల పునర్నిర్మాణంలో ఉపయోగపడుతున్నాయి.
చేనేత, కల్లుగీత, మత్స్య, గొర్రెల పెంపకం, అటవీ ఆధారిత వృత్తులు, తోలు, మట్టి, బాంబూ, పశు ఆధారిత వృత్తులు శాస్త్రీయ పరిశోధనల ద్వారా కొత్త పరిశ్రమలకు దారి చూపగలవు. ఇప్పటివరకు ‘తక్కువస్థాయి వృత్తులు’గా నిర్లక్ష్యం చేసిన రంగాల్లోనే భవిష్యత్ బయో-ఎకానమీ దాగి ఉందని ఈ పరిశోధనలు గుర్తుచేస్తున్నాయి. అందుకే ప్రభుత్వం సంప్రదాయ వృత్తులను భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థలో భాగంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో చేపల ఉప ఉత్పత్తులపై, వ్యర్థాలపై కేంద్ర మత్స్య సాంకేతిక సంస్థ ( సీఐఎఫ్టీ) శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనాలు పరిశ్రమలకు కొత్త మార్గాన్ని చూపుతున్నాయి.
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ వనరుల వైద్యపరమైన వినియోగ అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఎస్వీ వెటర్నరీ విశ్వవిద్యాలయం నిపుణులు జీవ వైద్య అన్వయాలపై అధ్యయనం చేస్తున్నారు. రూయా ఆసుపత్రి వైద్య బృందం చేపల ఆధారిత పదార్థాలపై వైద్య ప్రయోగాలు నిర్వహిస్తోంది.
మత్స్యకారులకు స్థిరమైన మార్కెట్
ఈ పరిశోధనలు కేవలం నగర కార్పొరేట్ పరిశ్రమలకే పరిమితం కాదని, గ్రామీణ శ్రమజీవి సమాజాల జీవనోపాధిని కూడా మార్చగలదని చూపుతున్నాయి. ఇలాంటి అధ్యయనాలు మరింత విస్తరించాలంటే
ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, ప్రయోగశాలలకు ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వాలి. గ్రామీణ వృత్తులు, స్థానిక వనరులు, సంప్రదాయ జ్ఞానంపై ప్రత్యేక పరిశోధనా కేంద్రాలు ఏర్పడాలి. ఈ శాస్త్రీయ పురోగతితోపాటు తెలంగాణ మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, కళాశాలల్లో మధ్యాహ్న భోజనంలో చేపలను కూరగా అందించాలని చేసిన ప్రతిపాదన ఒక ప్రగతిశీల సామాజిక ఆలోచన.
చేపల్లో ఉండే ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, కాల్షియం వంటి పోషకాలు వారి ఆరోగ్యానికి అవసరమైనవి. ఈ విధానం విద్యార్థుల పోషకాహారాన్ని మెరుగుపరచడమే కాకుండా మత్స్యకారులకు స్థిరమైన మార్కెట్‌ను కూడా కల్పిస్తుంది. విద్యార్థులకు చేప మాంసాన్ని పౌష్టికాహారంగా అందించవచ్చు. అదే సమయంలో మిగిలే చేప పొలుసులు, చర్మం, ఎముకలను పారేయకుండా శాస్త్రీయంగా సేకరించి మెడికల్, బయోటెక్నాలజీ పరిశ్రమలకు ముడిసరుకుగా వినియోగించవచ్చు.
దేశానికే ఆదర్శంగా నిలిచే అవకాశం
ఒకే వనరు నుంచి ప్రజారోగ్యం, ఉపాధి, పరిశ్రమ, పర్యావరణ పరిరక్షణ అనే నాలుగు ప్రయోజనాలు ఒకేసారి సాధ్యమవుతాయి. తెలంగాణ ఈ నమూనాను సమర్థవంతంగా అమలు చేస్తే దేశానికే ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది. కాబట్టి ఆ వృత్తుల ద్వారా ఏర్పడే ఆర్థిక ప్రయోజనాలు ముందుగా ఆ వృత్తిదారులకే చేరాలి. చరిత్రలో అనేక సందర్భాల్లో శ్రమ జీవుల జ్ఞానం, ప్రకృతి ఆధారిత వనరులు, స్థానిక ఉత్పత్తులు పెద్ద పెట్టుబడిదారీ వ్యవస్థల చేతుల్లోకి వెళ్లి అసలు వృత్తిదారులు పక్కనపడిన ఉదాహరణలు ఉన్నాయి.
అందుకే కొత్త పరిశోధనలు, పరిశ్రమలు అభివృద్ధి చెందేటప్పుడు ప్రభుత్వం సామాజిక న్యాయం కోణాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. శ్రమజీవి వర్గాల ఆర్థిక స్వావలంబనను బలహీనపరిచే విధంగా చరిత్రలో అనేక వృత్తులు నిర్లక్ష్యానికి, విధానపరమైన అసమానతలకు గురయ్యాయి.
సహజసిద్ధమైన తాటి కల్లు ఒకప్పుడు గ్రామీణ ఆహార–ఆరోగ్య సంస్కృతిలో భాగంగా ఉండేది. కానీ తర్వాత కాలంలో భారీ మద్యం వ్యాపార వ్యవస్థలు, కార్పొరేట్ ఆధిపత్యం, లిక్కర్ మేనేజ్‌మెంట్ విధానాల కారణంగా తాటి, ఈత కల్లు క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఆర్థిక సంక్షోభంలో శ్రమజీవి కుటుంబాలు
భారీ వస్త్ర పరిశ్రమలు, యాంత్రిక ఉత్పత్తి, కార్పొరేట్ మార్కెట్ వ్యవస్థలు పెరగడంతో చేనేత క్రమంగా క్షీణించింది. శ్రమ, నైపుణ్యం, స్థానిక జ్ఞానంతో నిర్మితమైన చేతివృత్తులు పోటీ తట్టుకోలేని పరిస్థితుల్లోకి నెట్టబడ్డాయి. ఫలితంగా అనేక శ్రమజీవి కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లాయి.
అటవీ ప్రాంతాల్లోని ఇప్పసారాయి వంటి సహజ ఉత్పత్తులకు ఉన్న ఔషధ గుణాలపై సమగ్ర పరిశోధనలు చేయకుండా, వాటిని నిషేధం కోణంలోనే ఎక్కువగా చూడటం జరిగింది. ఈ అనుభవాలన్నీ మనకు ఒక స్పష్టమైన సామాజిక పాఠాన్ని చెబుతున్నాయి.
శ్రమజీవి వర్గాల సంప్రదాయ వృత్తులను నిర్లక్ష్యం చేయడం కాదు. శాస్త్రీయంగా అభివృద్ధి చేసి, ఆరోగ్య భద్రత, ప్రజా భాగస్వామ్యం, స్థానిక ఆర్థిక స్వావలంబన కోణంలో ముందుకు తీసుకెళ్లడం అవసరం. ప్రకృతి ఆధారిత వృత్తులు కార్పొరేట్ లాభాల కోసం కనుమరుగయ్యే పరిస్థితి కాకుండా, వాటి అసలు యజమానులైన శ్రమజీవి సమాజాల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలి.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
బెస్త, ముదిరాజ్, గంగపుత్ర, నీరటి వంటి మత్స్య వృత్తులపై ఆధారపడిన వర్గాలు అనేక ప్రాంతాల్లో గణనీయమైన జనాభా కలిగి ఉన్నాయి. వీరి ఆర్థిక స్వావలంబన పెరిగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడడంతోపాటు స్థానిక ఉపాధి పెరుగుతుంది.
దీనివల్ల విద్య, ఆరోగ్యం, రాజకీయ చైతన్యం కూడా మెరుగవుతాయి. చేప వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లు ప్రభుత్వ రంగంలో లేదా మత్స్యకార సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి. సేకరణ, నిల్వ, శుద్ధి, మార్కెటింగ్ ప్రక్రియల్లో స్థానిక వృత్తిదారుల భాగస్వామ్యం తప్పనిసరి.
అప్పుడే ఈ శాస్త్రీయ అభివృద్ధి నిజమైన సామాజిక న్యాయంగా మారుతుంది. పర్యావరణ పరిరక్షణ కోణంలో కూడా ఈ విధానం అత్యంత అవసరం. చేపల మార్కెట్ల వద్ద పేరుకుపోయే వ్యర్థాలు నీటి కాలుష్యానికి, దుర్వాసనకు, అంటువ్యాధులకు కారణమవుతున్నాయి. వాటిని శాస్త్రీయంగా వినియోగించడం ద్వారా పరిశుభ్రత పెరుగుతుంది. అంటే ఒకప్పుడు కాలుష్యంగా కనిపించిన పదార్థమే ఇప్పుడు ప్రజారోగ్యాన్ని కాపాడే ఔషధంగా మారుతోంది.
ఫిషరీస్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పాలసీ రూపొందించాలి
ఇది ప్రకృతి, విజ్ఞానం, శ్రమజీవి సమాజం మధ్య ఏర్పడాల్సిన కొత్త సంబంధానికి సంకేతం. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక ‘ఫిషరీస్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పాలసీ’ రూపొందించాలి. పాఠశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రులు, మత్స్యకార సంఘాలు, పరిశోధనా సంస్థలు కలిసి పనిచేసే సమగ్ర నమూనాను అమలుచేయాలి.
చేప మాంసం ఆరోగ్యానికి, చేప వ్యర్థాలు వైద్యరంగ పురోగతికి ఉపయోగపడేవిధంగా వ్యవస్థను అభివృద్ధి చేయాలి. అదే సమయంలో సంప్రదాయ వృత్తులు ఆధారంగా కొత్త పరిశోధనలు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు సృష్టించే దిశగా ప్రభుత్వాలు ముందడుగు వేయాలి.
శాస్త్రీయ పురోగతి అంటే కేవలం కార్పొరేట్ లాభం కాదు. శ్రమజీవి వర్గాల జీవన ప్రమాణాల మెరుగుదల కూడా కావాలి. నేడు చేపల వ్యర్థాలపై జరుగుతున్న ఈ పరిశోధనలు ఒక స్పష్టమైన సామాజిక సందేశాన్ని ఇస్తున్నాయి. శ్రమజీవి వృత్తుల్లో ఉన్న జ్ఞానం, వనరులు, ఉప ఉత్పత్తులను శాస్త్రంతో కలిపితే సమాజానికి ఆరోగ్యం, ఉపాధి, ఆర్థిక స్వావలంబన ఒకేసారి సాధ్యమవుతుంది.
పాపని నాగరాజు
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
