వచ్చే నెల 2న యాదగిరి గుట్టలో భారీ బహిరంగ సభ

వచ్చే నెల 2న యాదగిరి గుట్టలో భారీ బహిరంగ సభ
  • యాదగిరి గుట్ట నుంచి ప్రారంభం
  • 26న వరంగల్​లో ముగింపు
  • యాత్ర పోస్టర్స్​ రిలీజ్​ చేసిన పాదయాత్ర కన్వీనర్​ మనోహర్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీజేపీ చేపట్టనున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. వచ్చే నెల 2న యాదగిరి గుట్టలో యాత్ర ప్రారంభం కానున్న సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయించింది. లక్ష మంది సభకు హాజరయ్యేలా దృష్టి పెట్టింది. చీఫ్ గెస్ట్​గా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరుకానున్నారు. సభకు జనాన్ని తరలించేందుకు మండలానికో సీనియర్ లీడర్​ను ఇన్​చార్జీగా నియమించింది. యాత్ర ప్రారంభ సభను సక్సెస్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని పాదయాత్ర కమిటీ కన్వీనర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి చెప్పారు. గురువారం పార్టీ స్టేట్ ఆఫీస్​లో యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను వివరించారు. తర్వాత యాత్ర పోస్టర్​ను రిలీజ్ చేశారు. వచ్చే నెల 26న వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ సందర్భంగా వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్​లో సుమారు 2 లక్షల మందితో ముగింపు సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి చీఫ్​ గెస్ట్​గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా ఆ స్థాయిలో కీలక నేతను ఆహ్వానించనున్నారు.

తెలంగాణ సంస్కృతితో ముడిపడి ఉన్న ప్రాంతాల మీదుగా..

యాత్ర సాగే ప్రాంతాలు తెలంగాణ సంస్కృతి, చరిత్రతో ముడిపడి ఉన్నాయని మనోహర్ రెడ్డి చెప్పారు. భూదాన్ ఉద్యమానికి నేతృత్వం వహించిన వినోబా భావేతో అనుబంధం ఉండడంతో పాటు చీరలకు ప్రసిద్ధి చెందిన  పోచంపల్లిలో వచ్చే నెల 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనికి కేంద్ర చేనేత,  జౌళీ శాఖ మంత్రి చీఫ్​ గెస్ట్​గా హాజరవుతారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గ పరిధిలోని చిన్న కొండూర్, మరో జలియన్ వాలాబాగ్ గా పిలువబడే.. నిజాం అరాచకాలకు అద్దంపట్టిన గుండ్రాంపల్లి గ్రామాల మీదుగా ఈ  యాత్ర సాగనుంది. యాత్ర సక్సెస్ కోసం 30 కమిటీలు పని చేస్తాయి.