16 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత?

16 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత?

ఖమ్మం, వెలుగు: ‘అపార అనుభవం ఉన్న నాయకులను పార్టీ కోసం ఉపయోగించుకోవాలి. ఓడిపోయినంత మాత్రాన పక్కన పెట్టినట్టు కాదు.’  ఐదు రోజుల క్రితం ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్​ముఖ్యనేతల సమావేశంలో కేటీఆర్​చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్​లో చేరిన 16 మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించే కేటీఆర్​ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ సీనియర్​లీడర్లు భావిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్​ తరపున గెలిచిన 12 మంది, టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు, ఇండిపెండెంట్లుగా విజయం సాధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు మొత్తం 16 మంది టీఆర్ఎస్​లోకి జంప్​అయ్యారు. ఇందులో అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారే ఏడుగురున్నారు. ఇతర పార్టీల్లో గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్​లో చేరినవారికి, ఆ స్థానాల్లో కారు గుర్తుపై పోటీ చేసి ఓడిపోయిన వారికి మధ్య రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విభేదాలు కొనసాగుతున్నాయి. పలుసార్లు సర్దిచెప్పినా లీడర్లు తీరు మారలేదు. ఆయా ప్రాంతాల్లో సిట్టింగులకు టికెట్లు ఇస్తే టీఆర్ఎస్​క్యాడర్​వ్యతిరేకంగా పనిచేసే చాన్స్​ఉండడం, మరోవైపు కాంగ్రెస్​కు ఓటేస్తే టీఆర్ఎస్​కు వేసినట్లేనని, గెలిచిన తర్వాత మళ్లీ టీఆర్ఎస్​లో చేరతారని బీజేపీ చేస్తున్న ప్రచారం రూలింగ్​పార్టీని కలవరపెడుతోంది. దాంతో సీనియర్​లీడర్లను మళ్లీ దగ్గరకు తీసుకుంటోంది. 

ఖమ్మం టీఆర్ఎస్ లో వర్గపోరు

ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పాలేరు నుంచి కందాల ఉపేందర్​రెడ్డి, వైరా నుంచి రాములునాయక్, ఇల్లందు నుంచి హరిప్రియ, పినపాక నుంచి రేగా కాంతారావు, కొత్తగూడెం నుంచి వనమా వెంకటేశ్వరరావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గులాబీ పార్టీలో చేరారు. ప్రధానంగా కాంగ్రెస్​ నుంచి గులాబీ గూటికి చేరినవారికి టీఆర్ఎస్​కేడర్ దూరంగా ఉంటోంది. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్​ఎమ్మెల్యేలు మళ్లీ పోటీ చేస్తే ఓడించాలన్న కసి కాంగ్రెస్​కేడర్​లో కనిపిస్తోంది. దీన్ని పీకే టీమ్​సర్వేల్లో గుర్తించడం వల్లే ఇన్నాళ్లూ మాజీలను లైట్​ తీసుకున్న టీఆర్ఎస్​హైకమాండ్​ఇప్పుడు వారిని దగ్గరకు తీస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే సూపర్​పవర్​అంటూ వారికి హైకమాండ్​పూర్తిస్థాయి పగ్గాలు ఇచ్చింది. ఓడిపోయినంత మాత్రాన మాజీలను పక్కనపెట్టినట్టు కాదని, వాళ్ల అనుభవాన్ని కూడా పార్టీ కోసం ఉపయోగించుకోవాలంటూ ప్రస్తుతం కేటీఆర్​చేసిన  కామెంట్ తో ఇకపై ఎమ్మెల్యేలే సూపర్​పవర్​కాదని పరోక్షంగా చెప్పినట్లయింది. 

దూకుడు తగ్గించిన సీనియర్లు

పాలేరులో గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉన్నారు. కాంగ్రెస్​ నుంచి గెలిచిన కందాల టీఆర్ఎస్​లో చేరడంతో అక్కడ వర్గపోరు మొదలైంది. దీంతో పరిస్థితులను బేరీజు వేసుకొని నియోజకవర్గంలో రెగ్యులర్​పర్యటనలతో తుమ్మల మళ్లీ యాక్టివ్​అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎలాగైనా పాలేరు నుంచి పోటీలో ఉంటానని చెబుతూ వస్తున్నారు. దీంతో ఒక సమయంలో ఆయన పార్టీ మారే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. అయితే మూడేళ్ల నుంచి ఎన్నడూ లేని విధంగా ఇటీవల ఆయన హైదరాబాద్​వెళ్లి కేటీఆర్​తో గంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా రాజకీయాలపై చర్చ జరిగిందని, హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పార్టీ టికెట్ పై తుమ్మల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక కొల్లాపూర్​లోనూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై కాంగ్రెస్​ నుంచి పోటీ చేసిన హర్షవర్ధన్​గెలిచారు. తర్వాత టీఆర్ఎస్​లో చేరారు. ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకొని తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అప్పటి నుంచి జూపల్లి ఆగ్రహంతో ఉన్నారు. కొంతమంది కలిసివచ్చేవారితో వేరే పార్టీలోకి వెళ్లేందుకు ఆయన రూట్ క్లియర్​చేసుకుంటున్నారన్న ప్రచారం జరిగింది. కానీ, ఈ మధ్య ఆయన స్పీడ్ తగ్గించి సైలెంట్ అయ్యారు. తనకు మళ్లీ టీఆర్ఎస్​లో ప్రాధాన్యత ఉంటుందన్న సంకేతాలు రావడమే దీనికి కారణమన్న ప్రచారం జరుగుతోంది. 

పార్టీ మారినవాళ్లలో అంతర్మథనం

రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్​రెగ్యులర్​గా ప్రశాంత్ కిషోర్​కు చెందిన ఐప్యాక్​టీమ్ ద్వారా సర్వేలు చేయిస్తున్నారు. ఈ సర్వేల్లో 35 మంది సిట్టింగులపై తీవ్ర వ్యతిరేకత ఉందని గుర్తించినట్లు సమాచారం. వీరిలో ప్రధానంగా కాంగ్రెస్​ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారన్న టాక్​ఉంది. ఖమ్మంలో కేటీఆర్​కామెంట్లు చేయడానికి ఇదే కారణమన్న విశ్లేషణలున్నాయి. అయితే కేటీఆర్​కామెంట్స్​పై పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాత్రం కొంత​ అంతర్మథనంతో ఉన్నారు. ఎవరి గురించి ఈ కామెంట్లు చేశారా అని ఆరా తీస్తున్నారు. అన్​కండిషనల్ గా పార్టీలో చేరితే, ఇప్పుడు కొత్తగా ఈ టెన్షన్​ ఏమిటని మధన పడుతున్నారు. అయితే ప్రస్తుతానికి పార్టీకి, హైకమాండ్​కు వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్​మెంట్ చేయకుండా మౌనం పాటిస్తున్నారు.