సోలార్‌‌ పవర్‌‌కే జనం ఓటు!

సోలార్‌‌ పవర్‌‌కే జనం ఓటు!
  • వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సర్వేలో వెల్లడి
  • పెట్రో ప్రొడక్ట్‌‌‌‌ల నుంచి మారే ఆలోచనలో ప్రజలు

న్యూఢిల్లీ: పెట్రో ప్రొడక్టుల ధరలు పెరగడం వల్ల తమ జేబుపై భారం ఎక్కువవుతోందని, కొనుగోలు శక్తి తగ్గుతోందని ఇండియాలో సహా ప్రపంచమంతటా జనం ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్, డీజిల్​కు బదులు వీలైనంత త్వరగా సోలార్​, విండ్​ వంటి క్లీన్​ ఎనర్జీలకు మారాలని కోరుకుంటున్నారు. వాతావరణ మార్పుల విధానాలే ఇంధనాల ధరల పెరుగుదలకు కారణమని మనదేశ జనం అంటున్నారు. వరల్డ్​ ఎకనమిక్​ ఫోరం – ఇప్సోస్​ నిర్వహించిన సర్వే ద్వారా ఈ వివరాలు తెలిశాయి. సర్వే కోసం ఈ ఫిబ్రవరి – మార్చి నెలల్లో 22,534 మంది నుంచి వివరాలను సేకరించారు. రాబోయే ఐదేళ్లలోపే తమ దేశం సంప్రదాయ ఇంధనాలను వదిలేసి క్లీన్​ ఎనర్జీలకు మారాలని సర్వేలో పాల్గొన్న ప్రతి పది మందిలో ఎనిమిది మంది చెప్పారు. ఇండియన్లలో 90 శాతం మంది రెస్పాండెంట్లు కూడా ఈ వాదనను సమర్థించారు. వాతావరణ మార్పుల విధానాల (బీఎస్​–6 ఫ్యూయల్​కు మారడం వంటివి) వల్లే పెట్రో ప్రొడక్టుల ధరలు  పెరుగుతున్నాయని 13 శాతం మంది చెప్పారని డబ్ల్యూఈఎఫ్​ పేర్కొంది.

జేబుకు చిల్లు...

ధరల పెరుగుదల వల్ల కొనుగోలు శక్తిపై ఎంత మేరకు ఎఫెక్ట్​ ఉంటుందని రెస్పాండెంట్లను అడిగారు.  సర్వేలో పాలుపంచుకున్న 30 దేశాలలో సగానికి పైగా యూజర్లు (55 శాతం) శక్తి ధరల పెరుగుదల వల్ల తమ మొత్తం కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. అయితే వచ్చిన జవాబులు ఒక్కో దేశానికి ఒక్కోలా ఉన్నాయి. దక్షిణాఫ్రికా (77 శాతం), జపాన్ (69 శాతం),  టర్కీ (69 శాతం) రెస్పాండెంట్లలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది ధరల పెరుగుదల తమపై "చాలా ఎక్కువగా  లేదా తగినంత" ఎఫెక్ట్​ చూపుతుందని  చెప్పారు. స్విట్జర్లాండ్ (37 శాతం)  నెదర్లాండ్స్ (37 శాతం) దేశాల్లో మూడింట ఒక వంతు మంది మాత్రమే ఎఫెక్ట్​ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇండియాలో 63 శాతం మంది  ఇంధన ధరల పెరుగుదల వల్ల ఇప్పటికే జేబుపై తీవ్రభారం ఉందని చెప్పారు. చమురు,  గ్యాస్ ‘‘మార్కెట్లలో ఒడిదుడుకులు’’  లేదా ‘‘యుద్ధం’’ వంటి ఇబ్బందులు.. ధరలు పెరగడానికి కారణమని ప్రపంచవ్యాప్తంగా వరుసగా 28 శాతం,  25 శాతం మంది రెస్పాండెంట్లు అన్నారు.    పెరిగిన డిమాండ్‌ను తీర్చడానికి తగినంత సరఫరా లేదని మరో 18 శాతం మంది పేర్కొన్నారు. తమకు కచ్చితమైన సమాచారం తెలియదని 16 శాతం మంది చెప్పారు. 13 శాతం మంది మాత్రమే వాతావరణ మార్పు విధానాలను విమర్శించారని ఈ సర్వే రిపోర్టు వివరించింది. 

వాతావరణ మార్పుల విధానాలూ కారణమే..

ఇటీవలి ధరల పెరుగుదలకు కారణంగా వాతావరణ మార్పు విధానాలని భారతదేశం  నుంచి 24 శాతం మంది, జర్మనీ  నుంచి 20 శాతం మంది,  పోలాండ్ నుంచి19 శాతం మంది రెస్పాండెంట్లు అన్నారు. పూర్తిగా వాతావరణ విధానాల వల్లే పెట్రో ధరలు ఎక్కువయ్యాయని  ఏ ఒక్క దేశ ప్రజలు చెప్పలేదు.  వాతావరణ మార్పు విధానాలు, చమురు  గ్యాస్ మార్కెట్లలో ఆటుపోట్లు, యుద్ధం, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తగినంత సరఫరా లేకపోవడం వంటి ముఖ్య కారణాలని ఇండియా రెస్పాండెంట్లు అన్నారు. రాబోయే ఐదేళ్లలో తమ దేశం మామూలు ఇంధనాల నుండి మరింత పర్యావరణ అనుకూల ఫ్యూయల్స్​కు మారడం మీకు ఎంత ముఖ్యమని అడగగా.. ప్రపంచవ్యాప్తంగా సర్వేలో పాల్గొన్న వారిలో ప్రతి ఐదుగురిలో నలుగురి కంటే ఎక్కువ మంది (84 శాతం) ఇది తమకు చాలా ముఖ్యమని చెప్పారు. సర్వే చేసిన ప్రతి దేశంలో  మెజారిటీ రెస్పాండెంట్లు ఇలాగే జవాబు ఇచ్చారు. రష్యాలో 72 శాతం (ప్రపంచంలో అత్యల్పంగా)  అమెరికాలో 75 శాతం, భారతదేశంలో 89 శాతం మంది,  దక్షిణాఫ్రికా,  పెరూలో 93 శాతం మంది తమ దేశం కచ్చితంగా క్లీన్​ ఎనర్జీలను వాడాలని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల జనం  ఈ వాదనను బలంగా సమర్థించారు. ప్రపంచవ్యాప్తంగా, సర్వేకు హాజరైన దాదాపు అన్ని దేశాల ప్రజలు క్లీన్​ ఎనర్జీలు చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.  ఈ విషయంలో పురుషుల కంటే (81 శాతం)   మహిళల (87 శాతం) సంఖ్య కొద్దిగా ఎక్కువగా ఉంది.