పల్లెప్రగతిలో మంత్రులు, ఎమ్మెల్యేలపై తిరుగుబాటు

పల్లెప్రగతిలో మంత్రులు, ఎమ్మెల్యేలపై తిరుగుబాటు

పల్లె,పట్టణ ప్రగతిలో మంత్రులు, ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్నారు జనం. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలదేని నిలదీస్తున్నారు. సమాధానం చెప్పలేని ప్రజాప్రతినిధులు ప్రశ్నించినవారిపై పోలీసులను ప్రయోగిస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్దపాపయ్య పల్లి పల్లెప్రగతి సభలో మంత్రి ఎర్రబెల్లిపై ప్రశ్నల వర్షం కురిపించారు స్థానికులు. ఎవరికీ రుణమాఫీ జరగలేదని.. ఇండ్లు ఎందుకు కట్టలేదని నిలదీశారు రాజిరెడ్డి అనే స్థానికుడు. ఇల్లు ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నించిందో మహిళ. ఇక్కడి నాయకుడే ఇండ్లు కట్టలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు ఎర్రబెల్లి.  

వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటకు వెళ్లిన పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డికి జనం నుంచి వ్యతికరేకత ఎదురైంది. పల్లెప్రగతి కార్యక్రమంలో స్థానిక సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీశారు.సమాధానం చెప్పకుండానే సభ నుంచి వెళ్లిపోయారు. సమస్యలు చెప్పుకోడానికి వెళ్తే ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు ఆశా కార్యకర్తలు. కరోనా కష్టకాలంలో సేవలు చేసిన తమను కనీసం పట్టించుకోలేదన్నారు. 

వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య మాట్లాడుతుండగా... ఓ స్థానికుడు సమస్యలపై ప్రశ్నించారు. దాంతో మైకు తీసుకుని... ఏ సమస్యలు ఉన్నాయో చెప్పమన్నారు ఎమ్మెల్యే ....మీరే వచ్చి చూడాలంటూ అతను వాగ్వాదానికి దిగాడు. అన్నీ అబద్దాలు చెబుతున్నాడంటూ ఆగ్రహించిన ఎమ్మెల్యే రాజయ్య... అతన్ని పట్టుకుని పొమ్మంటూ పోలీసులను ఆదేశించారు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
ఇక జనగామ ఎమ్మల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కూడా నియోజక వర్గంలో ఏ సమావేశానికి  వెళ్ళినా...  నిరసన తప్పడంలేదు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని శాయంపేటల మండల కేంద్రంలో జరిగిన సభలో నిలదీశారు ప్రజలు.  

గతంలో ఇనుగుర్తిని మండల కేంద్రం చేస్తామని ప్రకటించారు మహబూబాబాద్ ఎమ్మల్యే శంకర్ నాయక్. ఇప్పటి వరకూ ఎందుకు ప్రకటించలేదంటూ ఎమ్మెల్యే, మంత్రి తీరుపై మండిపడుతున్నారు జనం. పల్లె ప్రగతి కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్, మంత్రి సత్యవతి రాథోడ్ వస్తున్నారని తెలిసి జనం పెద్ద ఎత్తున వచ్చారు. జనం ప్రశ్నించే అవకాశం ఉందని తెలియడంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు సత్యవతి రాథోడ్. జనానికి సమాధానం చెప్పాల్సిన ప్రజాప్రతినిధులు పోలీసులతో బెదిరింపులకు దిగుతున్నారని మండిపడుతున్నారు జనం.