ప్రజా సంబంధాలు పాఠ్యాంశంగా చేర్చాలి

ప్రజా సంబంధాలు పాఠ్యాంశంగా చేర్చాలి

 ఇది కమ్యూనికేషన్ల యుగం.  ప్రపంచ సమస్త సమాచార వ్యవస్థ మానవుని అరచేతిలోకి వచ్చింది. ఏ సమాచారం అయినా కొద్దిపాటి నిమిషాల సెకెండ్ల తేడాతో విశ్వవ్యాప్తం అవుతుంది.  ప్రింట్‌‌, ఎలక్ష్ఞానిక్‌‌ మీడియా సోషల్‌‌ మీడియా దినదినం కొత్త పుంతలు తొక్కుతూ సామాన్యునికి సైతం అత్యంత చేరువైన నేపథ్యంలో ప్రజాసంబంధాల వ్యవస్థ పటిష్టమవుతోంది. సరళీకృత ఆర్థిక విధానాలు గ్లోబలైజేషన్‌‌ ఫలితాలు ప్రపంచంలో 'సమాచార విప్లవం తీసుకువచ్చాయి.  ప్రస్తుతం మనం సమాచార విప్లవయుగంలో ఉన్నాము. 

ఈ నేపథ్యంలో ప్రజాసంబంధాల (పీ.ఆర్‌‌) వ్యవస్థ ఒక పరిశ్రమ స్థాయికి చేరుకుంది. మనది అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ప్రజల కోసం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆయా నిర్దేశిత లక్ష్యాలకు చేరువ కావాలంటే ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిలాగా పని చేసే సమాచార వ్యవస్థ పటిష్టంగా ఉందాలి. నేడు మన ప్రభుత్వాలు లక్షల కోట్ల బడ్జెట్‌‌ను అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నాయి. 

ఒకొక్క పథకానికి వందల, వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ పరిస్థితులలో ప్రజలలో ఆయా పథకాల పట్ల అవగాహన కల్పించడానికి స్పష్టమైన సరళమైన సమాచార సమగ్రంగా ప్రజా బాహుళ్యానికి అందించే ప్రజాసంబంధాల విభాగం నేడు పరిపాలనలో అత్యంత కీలక విభాగంగా మారుతోంది. అన్ని ప్రభుత్వ శాఖల కార్యక్రమాలు ప్రచారం లేనిదే విజయవంతం కావడం అసాధ్యమని గమనిస్తున్నాయి.

సమాచార సాంకేతిక విప్లవం

ఒకప్పుడు  కార్యాలయాలకే  పరిమితమైన పాలనావ్యవస్థ సమాచార సాంకేతిక విప్లవం ఫలితంగా పాలనా విభాగం నిర్వచనమే మారిపోయింది. ఈ మార్పులను ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రతి చిన్న కార్యాలయమైనా ప్రజా సంబంధాలు మెరుగుపర్చుకునేలా పరిపాలనా విభాగాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. ఫైవేట్‌‌ కార్పొరేట్‌‌ రంగంలో “ప్రచారం” అనేది అతి ముఖ్యమైన అంశం. వస్తు సేవలు ఉత్పత్తులు వినియోగదారులకు చేరువ కావాలంటే ప్రణాళిక ఉత్పత్తులు వినియోగదారులకు చేరువ కావాలంటే ప్రణాళికాబద్ధమైన, ఆకర్షణీయమైన ప్రచారం అవసరం.

 కార్పొరేట్‌‌ సంస్థలు దాదాపు 20 నుంచి 80 శాతం కేవలం ప్రచారం కోసమే ఖర్చు పెడుతున్నాయి.  వాట్సాప్‌‌,  ఫేస్‌‌బుక్‌‌,  ఎక్స్​, ఇన్​స్టాగ్రామ్​ తదితర సామాజిక మాధ్యమాల నేపథ్యంలో ప్రతి సామాన్య పౌరుడు ఒక పీఆర్‌‌వోగా మారాడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల ప్రభావం ఎంతగా ఉందో గమనించాం. పైవేట్‌‌ కార్పొరేట్‌‌ విద్యా సంస్థలకు ప్రతి సంవత్సరం ప్రచారం మీద ఖర్చు చేసే వ్యయం ఒక్కోసారి వారి ఆదాయంలో సగం పైన ఉంటుంది. ఆసుపత్రులు పీ.ఆర్‌‌.వో వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీలు నాయకులు ప్రచారం మీద ఎంతగా ఆధారపడుతున్నారో ఎంతగా ఖర్చు చేస్తున్నారో మనం గమనిస్తూనే ఉన్నాము. సామాజిక మాధ్యమాలలో పోటాపోటీగా పోస్టింగ్‌‌లు రావడం వెనక పీఆర్‌‌ వ్యవస్థ ఎంత బలంగా పాతుకు పోతుందో  అర్థమవుతుంది. 

‘ప్రజాసంబంధాలు' ఒక నూతన శాస్త్రం

ఒకప్పుడు ప్రభుత్వాలు కేవలం సమాచార ప్రసార ప్రజాసంబంధాల శాఖలపైన ఆధారపడేవి. కానీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రతి శాఖలో ఒక ప్రత్యేక సమాచార విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.  సమాచార హక్కు చట్టం 2005 అమలులోకి వచ్చిన తర్వాత ఈ అవసరం మరింతగా ఏర్పడింది. రాజనీతిశాస్త్రం, పరిపాలనా శాస్త్రం వంటి సామాజిక శాస్త్రంలాగానే ‘ప్రజా సంబంధాలు’ అధ్యయనం కీలకంగా మారబోతుంది. రానున్న రోజుల్లో 'ప్రజాసంబంధాలు' - కమ్యూనికేషన్‌‌' వంటి అంశాల పట్ల లోతైన అధ్యయనం చెయ్యాల్సిన ఆవశ్యకత  క్రమక్రమంగా పెరుగుతోంది. ఇందుకోసం ‘ప్రజాసంబంధాలు' ఒక నూతన శాస్త్రంగా భావించి భావి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో ఒక తప్పనిసరి పాఠ్యాంశంగా రూపొందించాల్సిన అవసరం ఉంది.

- సురేష్‌‌ కాలేరు, అసిస్టెంట్​ పీఆర్వో, తెలంగాణ రాష్ట్ర  క్రీడా సాధికార సంస్థ