అందర్నీ తప్పుదోవ పట్టించి.. పనులకు టెండర్లు పిలవట్లే

అందర్నీ తప్పుదోవ పట్టించి.. పనులకు టెండర్లు పిలవట్లే

 కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జడ్పీ మీటింగ్ ఆయా శాఖలకు చెందిన జిల్లా ఆఫీసర్లపై  అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఫైర్ అయ్యారు. పలు ఆంశాలపై నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జడ్పీ చైర్‌‌‌‌పర్సన్‌‌ దఫేదర్ శోభ అధ్యక్షతన కలెక్టరేట్‌‌లో జరిగిన జడ్పీ మీటింగ్‌‌లో పలు ఆంశాలపై చర్చించారు. అగ్రికల్చర్ ఆంశం చర్చకు రాగానే భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని కొందరు సభ్యులు ప్రస్తావించారు.

మాచారెడ్డి మండలానికి చెందిన రాజు అనే రైతు చనిపోయి ఏడాది అవుతున్న రైతు బీమా ఎందుకు రాలేదంటూ అగ్రీకల్చర్ జిల్లా ఆఫీసర్ భాగ్యను విప్​ గంప గోవర్ధన్ ప్రశ్నించారు. ఆ ఫ్యామిలీకి సొమ్ము రాకపోతే బాధ్యత ఎవరు వహిస్తారంటూ ఆగ్రహం చెందారు. పరిశీలన చేసి ఆ ఫ్యామిలీకి న్యాయం చేయాలన్నారు. మన ఊరు- మన బడి పొగ్రాంలో భాగంగా రూ.కోటి వరకు ఉన్న పనులకు సంబంధించి ఎస్ఈ స్థాయిలో టెండర్లు పిలవాల్సి ఉన్నా ఎందుకు పిలవలేదని పంచాయతీరాజ్ ఎస్ఈ  ప్రభాకర్‌‌‌‌పై విప్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన పరిధి కాదంటూ తప్పుడు సమాచారం చెబుతున్నారన్నారు. 4 నెలల కింద దీనిపై గవర్నమెంట్​జీవో ఇచ్చిందంటూ గోవర్ధన్ చెప్పారు. అందరిని తప్పుదోవ పట్టించటమే కాకుండా,  పనులకు టెండర్లు ఎందుకు పిలవలేదంటూ ప్రశ్నించారు. కలెక్టర్​ జితేష్​వి పాటిల్ జోక్యం చేసుకుని దీనిపై తాను పరిశీలన చేస్తానని, అవసరమైతే చర్యలు తీసుకుంటానని చెప్పారు. 

ఏఎన్ఎంల నియమకాలు ఎలా చేపట్టారు..?

ఇటీవల హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌లో చేపట్టిన ఏఎన్ఎంల పోస్టుల భర్తీకి సంబంధించి ఏ ప్రతిపది కన నియమించారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్​ డీఎంహెచ్‌‌వో లక్ష్మణ్‌‌​సింగ్‌‌ను  ప్రశ్నించారు. రోస్టర్​పద్ధతిలో ఇంటర్వ్యూలకు పిలిచి పోస్టులు భర్తీ చేసినట్లు డీఎంహెచ్‌‌వో చెప్పారు. ఇష్టారాజ్యంగా నియమకాలు చేపట్టారని ఎమ్మెల్యే అన్నారు.  ఇందుకు సంబంధించిన పూర్తి రికార్డులు తనకు చూపాలన్నారు. ఆర్​అండ్​బీ శాఖ డీఈ శ్రీనివాస్‌‌పై మాచారెడ్డి ఎన్​చార్జీ ఎంపీపీ నర్సింహ్మారెడ్డి, దోమకొండ జడ్పీటీసీ తిర్మల్​గౌడ్ మండిపడ్డారు.

రోడ్ల నిర్వహణ పట్టించుకోవడం లేదని, దోమకొండ ఆర్​అండ్​బీ గెస్ట్ హౌస్‌‌ స్థలం కబ్జా అవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.  నాగిరెడ్డిపేట  మండలం పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని  స్థానిక ఎంపీపీ, జడ్పీటీసీలు ప్రస్తావించారు. బీబీపేట మండలంలో కొద్ది రోజుల కింద మంత్రి కేటీఆర్​ పర్యటించిన సందర్భంలో మానేర్​నుంచి ఎత్తిపోతల ద్వారా బీబీపేట ఏరియాకు సాగు నీటిని అందించేందుకు సంబంధించి రిపోర్టు ఇవ్వాలని ఇరిగేషన్​ఆఫీసర్లకు సూచించారని,  ఆఫీసర్లు  మాత్రం రిపోర్టు తయారు చేయడం లేదని జడ్పీ వైస్​ చైర్మన్​ ప్రేమ్‌‌కుమార్ ఫైర్ అయ్యారు. సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే, ఎంపీపీలు, జడ్పీటీసీలు,  ఆయా శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.