
టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, నయా వాల్ చటేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేశాడు. ఆదివారం (ఆగస్టు 24) తాను అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతూ తన నిర్ణయాన్ని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినా.. డొమెస్టిక్ క్రికెట్ ఆడతారని భావించారు. అయితే సోమవారం (ఆగస్టు 25) రంజీ ట్రోఫీ నుంచి తాను తప్పుకున్నట్టు పుజారా మరో షాక్ ఇచ్చాడు. వారం క్రితం వరకు పుజారా రంజీ ట్రోఫీ ఆడడానికి ఆసక్తి చూపించి ఇప్పుడు సడన్ గా తప్పుకోవడం చర్చనీయాంశమవుతోంది. తాను ఎందుకు రంజీ ట్రోఫీ ఆడట్లేదో కారణాన్ని కూడా పుజారా వెల్లడించాడు.
పుజారా స్పోర్ట్స్ టాక్ తో మాట్లాడుతూ ఇలా అన్నాడు.. "ఇది నా వ్యక్తిగత నిర్ణయం. తప్పుకోవడానికి ఇది సరైన సమయం అని నేను భావించాను. యువ ఆటగాళ్లకు దేశీయ క్రికెట్‌లో అవకాశాలు లభించాలి. ముందుగా నేను ఈ సీజన్ రంజీ ట్రోఫీ సీజన్‌లో ఆడతానని అనుకున్నాను. కానీ యువ ఆటగాళ్లకు అవకాశం లభిస్తే వారు వారికి నేను త్వరగా అవకాశాలు కల్పించినవాడిని అవుతాను. ఇది నా వ్యక్తిగత నిర్ణయం". అని పుజారా రంజీ ట్రోఫీ ఆడకపోవడానికి అసలు కారణం తెలియజేశాడు.
2023 దక్షిణాఫ్రికా టూర్ లో భాగంగా ఈ సీనియర్ ప్లేయర్ ను సెలక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే. 2020 నుండి పుజారా ఫామ్ దిగజారుతూ వస్తుంది. గత నాలుగేళ్లలో పుజారా భారత్ తరపున 28 టెస్టు మ్యాచ్ లాడితే యావరేజ్ 30 కంటే తక్కువగానే ఉంది. కేవలం ఒకసారి మాత్రమే మూడంకెల స్కోర్ ను చేరుకోగలిగాడు. నిలకడగా రాణించలేకపోవడం పుజారాకు మైనస్ గా మారింది. మూడో స్థానంలో పుజారాను భర్తీ చేసే ఆటగాడు దొరకకపోవడంతో పుజారాకు టెస్ట్ జట్టులో కష్టంగానే కొనసాగించాల్సి వచ్చింది. శుభమాన్ గిల్ మూడో స్థానంలో పాతుకుపోవడంతో పుజారా దారులు పూర్తిగా మూసుకుపోయాయి.
ఇండియా తరపున 103 టెస్ట్ మ్యాచ్ లాడిన పుజారా 43 యావరేజ్ తో 7195 పరుగులు చేశాడు. 19 సెంచరీలు చేసిన పుజారా.. టెస్టుల్లో స్పెషలిస్టుగా పేరుపొందాడు. ఆస్ట్రేలియాపై 2023లో డబ్ల్యూటీసి ఫైనల్ లో పుజారా తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. పుజారా కేరీర్ లో చిరస్మరణీయంగా మిగిలిన టెస్టు 2018-19 లో ఆడిన ఆస్ట్రేలియా టెస్టు. ఈ టెస్టులో మొత్తం 1258 బాల్స్ ఫేస్ చేసిన పుజారా.. 521 రన్స్ చేసి అదరగొట్టాడు. పన్నెండు వందలకు పైగా బాల్స్ ఫేస్ చేసి ఆస్ట్రేలియాకు వికెట్ దొరకకుండా చుక్కలు చూపించాడు. ఇందులో మూడు సెంచరీలు కూడా చేయడం దిగ్గజాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.