ఇవాళ ( జూన్ 28 ) పల్స్ పోలియో... ఒకవేళ వేయించడం కుదరకపోతే..!

ఇవాళ ( జూన్ 28 ) పల్స్ పోలియో... ఒకవేళ వేయించడం కుదరకపోతే..!
  • ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు..
  • రాష్ట్ర వ్యాప్తంగా 41 లక్షల మంది చిన్నారులకు వ్యాక్సిన్
  • నేడు బూత్ డే.. రేపు, ఎల్లుండి ఇంటింటికీ టీకా కార్యక్రమం
  • బోరబండ యూపీహెచ్​సీలో ప్రారంభించనున్న మంత్రి దామోదర

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నేడు ప్రారంభంకానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్దేశించిన బూత్ సెంటర్లలో చిన్నారులకు పోలియో వాక్సిన్ వేయనున్నారు. రేపు (సోమవారం), ఎల్లుండి (మంగళవారం) ఇంటింటికి తిరుగుతూ పోలియో చుక్కలు వేయనున్నారు. జనాభా రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-, సంగారెడ్డి వంటి జిల్లాల్లో అదనంగా జూలై 1వ తేదీన కూడా ఈ డ్రైవ్‌‌‌‌ ను కొనసాగించనున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40,97,749 మంది ఐదేండ్లలోపు చిన్నారులకు టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 22,979 పోలియో బూత్‌‌ లను ఏర్పాటు చేయగా, ప్రయాణాల్లో ఉన్న పిల్లల కోసం బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి చోట్ల 903 ట్రాన్సిట్ పాయింట్లను, మారుమూల ప్రాంతాల కోసం 903 మొబైల్ టీంలను సిద్ధం చేశారు. 

అలాగే, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌‌వాడీ టీచర్లు ఇతర శాఖల సమవ్వయంతో సేవలందించనున్నారు. ఆదివారం బోరబండ యూపీహెచ్సీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.