
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో ఈ నెల 12 నుంచి15 వరకు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. 0-–5 ఏండ్లలోపు పిల్లలకు 2,843 కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు.
కలెక్టరేట్ లో గురువారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లాలో 5 ఏండ్లలోపు చిన్నారులు 5,17,238 మంది ఉన్నారని, పోలియో కేంద్రాలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయన్నారు.
పోలియో చుక్కలు వేసుకోని వారికోసం 13, 14, 15 తేదీల్లో 11, 200 మంది వైద్య సిబ్బందితో ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయిస్తామన్నారు. హైదరాబాద్ జిల్లాలో 164 హైరిస్క్ ఏరియాలను గుర్తించామని, ప్రభుత్వ శాఖల సిబ్బంది, స్వచ్చంద సంస్థలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వాలంటీర్స్, పారా మెడికల్, నర్సింగ్ విద్యార్థులు పాల్గొని పోలియో చుక్కలు వేస్తారన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ వెంకటి, డీఎంవో డాక్టర్ రాములు ఉన్నారు.