ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నిందితుడు ఉమర్ మహ్మద్ ఇల్లు కూల్చివేత

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నిందితుడు  ఉమర్ మహ్మద్ ఇల్లు కూల్చివేత

పుల్వామా: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడుకు కారణమైన ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్ ఉన్-నబి కాశ్మీర్ ఇంటిని భద్రతా దళాలు కూల్చివేశాయి. శుక్రవారం తెల్లవారుజామున దక్షిణ కాశ్మీర్‌‌లోని పుల్వామాలో అతడి ఇంటిని కూల్చివేసినట్టు భద్రతా దళాలు వెల్లడించాయి. ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడులో 13 మంది మరణించగా.. 20 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఫరీదాబాద్‌‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ అయిన ఉమర్.. ఎర్రకోట దగ్గర నేతాజీ సుభాష్ మార్గ్‌‌లోని ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో పేలిపోయిన హ్యుందాయ్ ఐ20 కారును నడిపినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

 పేలుడు స్థలంలో లభించిన డీఎన్​ఏ నమూనాలు, అతని తల్లి నుంచి సేకరించిన నమూనాలు సరిపోలడంతో కారు నడిపింది ఉమరే అని పోలీసులు నిర్ధారించారు. భారత భూభాగంపై ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిచ్చే వారికి సందేశం పంపే ఉద్దేశంతోనే కాశ్మీర్‌‌లో అతని ఇంటి కూల్చివేత జరిగింది. ఇంతకుముందు పహల్గాం ఉగ్రదాడి కుట్రలో పాల్గొన్న వారిపై కూడా కూల్చివేత చర్యలు చేపట్టారు. ఉమర్ సహచర డాక్టర్లు ముజమ్మిల్, షాహీన్ సయీద్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు.