జోరుగా పునాస సాగు.. పత్తి, మక్క, కంది విత్తనాలు వేస్తున్న రైతులు.. సాగు అంచనా 1.34 కోట్ల ఎకరాలు

జోరుగా పునాస సాగు.. పత్తి, మక్క, కంది విత్తనాలు వేస్తున్న రైతులు.. సాగు అంచనా 1.34 కోట్ల ఎకరాలు
  • ఇప్పటికే వరి నార్లు పోసి నాట్లకు ఏర్పాట్లు 
  • పంట రుణాలు, రైతు భరోసాతో సర్కారు సహకారం 
  • వానాకాలం సాగు 1.34 కోట్ల ఎకరాలుగా అంచనా 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్ జోరుగా ప్రారంభమైంది. అన్ని జిల్లాల్లో రైతులు చేలలో విత్తనాలు వేస్తూ సాగు పనులు చేపడుతున్నారు. పత్తి విత్తనాలతో సాగు షురూ చేయగా, మక్కలు, కంది, పెసర వంటి పంటల సాగు కూడా ఊపందుకుంది. దీనికి తోడు వరి నార్లు పోయటం కూడా జోరందుకున్నది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఎక్కడ చూసినా పంట పొలాల్లో సాగు పనులతో రైతులు బిజీగా కనిపిస్తున్నారు. 

ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరుతో షురూ అయిన వానలు మే నెలతో పాటు జూన్ మొదటి వారంలోనూ కురుస్తున్నాయి. వర్షాలు కురవడంతో రైతులు భూములను సిద్ధం చేసుకుని సాగు పనులను ప్రారంభించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం వంటి జిల్లాల్లో రైతులు ట్రాక్టర్లు, నాగళ్లతో పంట భూములను చదును చేసి, విత్తనాలు వేస్తున్నారు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో పత్తి, సోయా, కంది, పెసర వంటి పంటలు సాగు అవుతున్నాయి. వరి నారు పోసి, నాట్ల కోసం రైతులు ప్రయత్నాలు షురూ చేశారు. ఈ నెలాఖరు నుంచే వరి నాట్లు మొదలయ్యే అవకాశం ఉందని అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్తున్నరు. 

వరి 66 లక్షల ఎకరాలు.. పత్తి 50 లక్షల ఎకరాలు.. 

రాష్ట్రవ్యాప్తంగా1.34 కోట్ల ఎకరాల్లో వానాకాలం పంటల సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో ప్రధానంగా వరి 66.80 లక్షల ఎకరాల్లో సాగు కావచ్చని, ఆ తర్వాత అత్యధికంగా పత్తి 50 లక్షల ఎకరాల్లో సాగు కావచ్చని అంచనా వేశారు. అలాగే మక్కజొన్న 6 లక్షల ఎకరాలు, కంది 5.50 లక్షల ఎకరాలు, సోయా 4.50 లక్షల ఎకరాల్లో సాగవుతాయని భావిస్తున్నారు. 

ఆదిలాబాద్ జిల్లాలో ఈ సీజన్ లో 5.60 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కానున్నాయని, అందులో ఒక్క పత్తి పంటే సుమారు 4 లక్షల ఎకరాల్లో సాగు కావచ్చని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో సాగు అయ్యే పత్తిలో 10 శాతం ఈ ఒక్క జిల్లాలోనే ఉంటుందని భావిస్తున్నారు. రైతులు వర్షాలపై ఆధారపడి సాగు చేస్తున్న ప్రాంతాల్లో, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండలంలో సోయా, కంది పంటల సాగు ఊపందుకుంది. ఇటీవల కురిసిన వర్షాలతో భూములు తడిగా మారడంతో, రైతులు అరకలతో దున్నుతూ సాగు పనులను వేగవంతం చేశారు.  

రైతులకు సర్కారు భరోసా

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సహకారం అందించేందుకు 'రైతు భరోసా' పథకం కింద ఎకరానికి రూ.12,000 రెండు దఫాలుగా పెట్టుబడి సాయం అందిస్తోంది. 2025 వానాకాలం సీజన్ కోసం ఈ నిధుల పంపిణీ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుందని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి తోడుగా రాష్ట్రంలో కొత్త సర్కారు రాగానే రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ చేయడంతో రైతులకు ఊరట కలిగింది. 

సర్కారు రుణమాఫీతో బ్యాంకు లోన్లు వేగవంతం అయ్యాయి. బ్యాంకులు గత ఏడాది టార్గెట్​లో 90 శాతం పంట రుణాలు ఇవ్వడానికి రుణమాఫీయే కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఎస్ఎల్బీసీ సమావేశం నిర్వహించి బ్యాంకులకు టార్గెట్ పెట్టి మరీ రైతులకు రుణాలు మంజూరు చేయాలని సర్కారు ఆదేశించింది. దీంతో రైతులకు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయంతో పాటుగా బ్యాంకుల నుంచి రుణాలు అందుతాయనే భరోసా కలుగుతోంది. అలాగే కరెంటుతో పాటు సాగునీటి సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా రైతులకు సర్కారు మరింత చేయూతను 
అందించనుంది.

సరిపడా విత్తనాలు, ఎరువులు.. 

వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లో పత్తి, సోయా, కంది, వరి, మక్క, పత్తి సాగు ఎక్కువగా జరుగుతుండగా.. కొన్ని ప్రాంతాల్లో వరి, సోయా, కంది ప్రధాన పంటలుగా ఉంటున్నాయి. గత సంవత్సరం విత్తనాల కొరత వంటి సమస్యలు ఎదురైన నేపథ్యంలో ఈ ఏడాది వ్యవసాయ శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, సాగుకు సరిపడా విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తోంది. అయితే, ఎరువులు, విత్తనాల ధరలు పెరగడంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఒక ఎకరం పత్తి సాగుకు రూ.35,000 నుంచి రూ.40,000 వరకు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు.