వ్యక్తి కడుపులో ఇయర్‌‌ ఫోన్లు, నట్లు, బోల్టులు.. ఆపరేషన్‌ చేసి తొలగించిన డాక్టర్లు

వ్యక్తి కడుపులో ఇయర్‌‌ ఫోన్లు, నట్లు, బోల్టులు.. ఆపరేషన్‌ చేసి తొలగించిన డాక్టర్లు

చండీగఢ్‌:  పంజాబ్‌లోని ఓ వ్యక్తి కడుపులోని వస్తువులు చూసి డాక్టర్లు షాక్‌ అయ్యారు. అతడి కడుపులో బోల్టులు, నట్లు, ఇయర్‌‌ ఫోన్స్‌ గుర్తించారు. దీంతో డాక్టర్లు మూడు గంటలు శ్రమించి, సర్జరీ చేసి కడుపులో ఉన్న వాటిని తొలగించారు. రాష్ట్రంలోని మోగాకు చెందిన 40 ఏండ్ల వ్యక్తి గత రెండేండ్లుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అయితే, ఇది చాలా నార్మల్‌ కడుపునొప్పి అనుకొని, లైట్‌ తీసుకున్నాడు. కానీ, గత రెండ్రోజులుగా కడుపు నొప్పి తీవ్రమైంది. 

కనీసం రాత్రిళ్లు నిద్ర కూడా పట్టేది కాదని కుటుంబసభ్యులు తెలిపారు. దాంతో పాటు తరుచుగా జ్వరం, వాంతులు రావడంతో అతన్ని మోగాలోని మెడిసిటీ హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్లు అతని కడుపును స్కాన్‌ చేసి చూడగా, అందులో ఉన్న వస్తువులు చూసి డాక్టర్లు షాక్‌ అయ్యారు. ఆ వెంటనే ఆపరేషన్‌ చేసి, కడుపులోని ఇయర్‌‌ ఫోన్స్‌, బోల్టులు, నట్స్‌, లాక్‌, తాళాలు, వాషర్స్‌ తదితర వస్తువులను తొలగించారు. 

ఆ వస్తువులు అతను ఎలా మింగాడనే విషయం తమకు తెలియదని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే, తమ కొడుకు కొన్ని రోజులుగా మానసికంగా ఇబ్బందులు పడుతున్నాడని అతని తల్లి చెప్పింది. మెడిసిటీ డైరెక్టర్‌‌ డాక్టర్‌‌ అజ్మీర్‌‌ కాల్రా మాట్లాడుతూ, తన కెరీర్‌‌లో ఇలాంటి కేసు చూడటం మొదటిసారిని పేర్కొన్నారు. చాలా రోజులుగా ఆ వస్తువులు బాధితుడి కడుపులో ఉండటంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని చెప్పారు. ప్రస్తుతం అతని పరిస్థితి సీరియస్‌గానే ఉందని తెలిపారు.