పంజాబ్​ ఆప్ ఎమ్మెల్యే జస్వంత్ అరెస్ట్

పంజాబ్​ ఆప్ ఎమ్మెల్యే జస్వంత్ అరెస్ట్
  •     ఓ సభలో మాట్లాడుతుండగానే అదుపులోకి తీసుకున్న ఈడీ

చండీగఢ్ :  పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే జస్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం మలేర్​కోట్లాలో జరుగుతున్న బహిరంగ సభలో జస్వంత్ మాట్లాడుతుండగానే అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే, జస్వంత్ సింగ్​ను ఏ కేసులో అరెస్ట్ చేశారన్న విషయం అధికారులు వెల్లడించలేదు. కాగా, జస్వంత్ ను అరెస్ట్ చేసిన తీరును ఆప్ నేతలు తప్పుబట్టారు. తమ ప్రతిష్టను దిగజార్చే కుట్రలో భాగంగానే బీజేపీ ఇలా చేసిందని ఆరోపించారు. సభలో మాట్లాడుతుండగా జస్వంత్​ ను అరెస్టు చేసి తీసుకెళ్లారని మండిపడుతున్నారు.

41 కోట్ల మోసం కేసు.. 

కిందటేడాది సెప్టెంబర్​లో రూ.41 కోట్ల మోసానికి సంబంధించిన కేసులో సీబీఐ అధికారులు జస్వంత్ సింగ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. రూ. 16.57 లక్షల నగదు, ఫారిన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల ఆధారంగా ఈడీ అధికారులు జస్వంత్​పై కేసు నమోదు చేశారు. విచారణకు రావాలని మూడుసార్లు పిలిచినప్పటికీ జస్వంత్ సింగ్ హాజరు కాలేదు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.