
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ మంగళవారం భేటీ అయ్యారు. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన మాన్.. సాయంత్రం ప్రగతి భవన్‌కు వెళ్లారు. కేసీఆర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు. అర గంటకు పైగా ఇద్దరు సీఎంలు పలు అంశాలపై చర్చించారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రత్యామ్నాయ రాజకీయాల దిశగా బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత విచారణ, తెలంగాణకు చెందిన పలువురి అరెస్ట్ సహా ఇతర అంశాలపైనా చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా మాన్‌ను కేసీఆర్ సత్కరించి సిల్వర్ ఫిలిగ్రీ వీణ బహూకరించారు. కేసీఆర్‌నూ మాన్ సన్మానించారు.
నెలాఖరు నుంచి బీఆర్‌ఎస్ యాక్టివిటీ
ఈ నెలాఖరు నుంచి బీఆర్‌ఎస్ యాక్టివిటీ ముమ్మరం చేయాలని పార్టీ చీఫ్ కేసీఆర్ నిర్ణయించారని పార్టీ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. బీఆర్‌ఎస్ ఆవిర్భావం.. దేశంలో గుణాత్మక మార్పుల కోసం ఎలాంటి అడుగులు వేయాలి.. దేశ ప్రజలకు మేలు చేసే ప్రత్యేక ఎజెండా.. పార్టీ విధివిధానాలపై ఈ నెలాఖరులో ఢిల్లీలో కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టులను ఈ సమావేశానికి ఆహ్వానించనున్నారు. దేశంలో.. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో రావాల్సిన గుణాత్మక మార్పులు, అందుకోసం బీఆర్‌ఎస్ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటీ అనేది దేశ ప్రజలకు వివరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ’ నినాదంతో మొదట ఆరు రాష్ట్రాల్లో కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే భారత రాష్ట్ర కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడిని నియమించిన కేసీఆర్.. నెలాఖరు వరకు పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా, ఏపీ, తెలంగాణలో కిసాన్ సెల్ యాక్టివిటీని షురూ చేయనున్నారు.