న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని ఐఎస్ఐ ఏజెంట్లతో పాటు వివిధ టెర్రరిస్ట్ గ్రూపులకు భారత ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నాడనే ఆరోపణలతో పంజాబ్ పోలీసులు ఓ బాలుడిని అరెస్టు చేశారు. పఠాన్‌కోట్‌లో సంజీవ్ కుమార్ (15) ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బాలుడిని సోషల్ మీడియాలో పాకిస్తాన్ హ్యాండ్లర్లు ప్రభావితం చేశారని వారు తెలిపారు. ఆ బాలుడు జమ్మూ-కాశ్మీర్ కు చెందిన వాడని పఠాన్‌కోట్ ఎస్పీ దల్జిందర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు.
‘‘ఏడాది క్రితం అతని తండ్రి మరణించాడు. తండ్రి హత్యకు గురయ్యాడని, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని బాలుడు భావించాడు. పోలీసుల దర్యాప్తులో అది హత్య అనేందుకు ఆధారాలు లభించలేదు. కానీ, బాలుడి అనుమానం అతని మనస్తత్వాన్ని ప్రభావితం చేసింది.
ఈ క్రమంలో అతడు అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను సందర్శిస్తుండగా.. పాకిస్తాన్ ఏజెన్సీల ఉచ్చులో పడ్డాడు. గతేడాది కాలంగా వారితో సంప్రదింపులు కొనసాగిస్తూ.. వారు అడిగిన సమాచారాన్ని పంపించాడు. పాకిస్తాన్ ఏజెంట్లు బాలుడి మొబైల్ ఫోన్‌ను హ్యాక్ చేశారు. ఆ తర్వాత అతని మొబైల్ నుంచి సమాచారం తీసుకుంటున్నారు. అతడు కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను వీడియో తీసి సమాచారం సేకరించాడు. మేము అతన్ని అదుపులోకి తీసుకోకపోతే, భవిష్యత్తులో ఏదైనా పెద్ద నేరమే చేసేవాడని పోలీసులు తెలిపారు.
కాగా, పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళకు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సమాచారం లీక్ చేశాడనే ఆరోపణలతో హర్యానాలోని అంబాలాలో సునీల్ అలియాస్ సన్నీని అరెస్టు చేసినట్లు క్రైమ్ డీఎస్పీ వీరేంద్ర కుమార్ తెలిపారు. నిందితుడు 2020 నుంచి ఒక వైమానిక దళ స్థావరంలో మరమ్మతు పనుల కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
