వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్ధూతో ఏర్పడిన విభేదాలతో ఆ పార్టీకి, సీఎం పదవికి రాజీనామా చేసి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో పార్టీ స్థాపించిన కెప్టెన్ అమరీందర్ సింగ్ పొత్తులపై ప్రకటన చేశారు. వచ్చే ఏడాదిలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శిరోమణి అకాలీదళ్‌ సంయుక్త్ పార్టీలతో కలిసి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ రెండు పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని సూత్రప్రాయంగా పొత్తు ఖరారైందని కెప్టెన్ చెప్పారు. ఇక ఏ పార్టీ ఎన్ని సీట్లు, ఏయే నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగాలన్న అంశాలపై చర్చించి, నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అన్ని పార్టీలు గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేయాలని తాను సూచించానన్నారు. వచ్చే ఏడాదిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి అమరీందర్ ఇవాళ చండీగఢ్‌లో మీడియాతో మాట్లాడారు.

బీజేపీ, శిరోమణి అకాలీదళ్‌ సంయుక్త్ పార్టీలతో పోటీ చేసి వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన ధీమాగా చెప్పారు. పంజాబ్ ఎన్నికల్లో గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని, కచ్చితంగా గెలిచి తీరుతామని అన్నారు. మరోవైపు తమ పార్టీ పంజాబ్‌ లోక్ కాంగ్రెస్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం పది రోజుల క్రితమే మొదలైందని, పార్టీలో ఎవరిని చేర్చుకోవాలన్న దానిపై జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేశామని అమరీందర్ చెప్పారు.