పర్వదినాన దేవుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు, ప్రసాదాలు తయారుచేస్తారు. మనం తినే ఆహారం విషయంలోనూ అంతే శ్రద్ధ వహించాలి. ఆరోగ్యకరమైన ఫుడ్ తయారుచేసుకోవాలి. సమయానికి సరైన తిండి తినడం వల్ల శరీరం హెల్దీగా ఉంటుంది. కాబట్టి ఈ హెల్దీ రెసిపీలపై ఓ లుక్కేయండి.
పూరీలు
కావాల్సినవి :
సగ్గుబియ్యం - పావు కప్పు
మైదా, గోధుమపిండి, బటానీలు - ఒక్కోటి అర కప్పు
ధనియాలపొడి, కారం - ఒక్కోటి అర టీస్పూన్
నీళ్లు, ఉప్పు - సరిపడా , నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
ఇంగువ - పావు టీస్పూన్, పచ్చిమిర్చి - ఒకటి
తయారీ :
సగ్గుబియ్యాన్ని రాత్రంతా నానబెట్టాలి. బటానీలను ఉడికించి, మెదపాలి. పాన్ మీద నూనె వేడి చేసి పచ్చిమిర్చి తరుగు వేసి వేగించాలి. తర్వాత నెయ్యి వేడి చేసి కారం, ధనియాలపొడి, ఉప్పు, సగ్గుబియ్యం, మెదిపిన బటానీ వేసి కలపాలి. ఒక గిన్నెలో గోధుమపిండి, మైదా, ఉప్పు, మందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం, నూనె వేసి ముద్దగా కలపాలి. దానిపై మూతపెట్టి కాసేపు పక్కన ఉంచాలి. చిన్న ఉండలు చేసి పూరీలా చేయాలి. కడాయిలో నూనె వేడి చేసి పూరీలు వేగించాలి.
గ్రీన్ చీలా
కావాల్సినవి :
బటానీలు, శనగపిండి - ఒక్కో కప్పు, పనీర్ తరుగు - అర కప్పు
అల్లం తరుగు - అర టీస్పూన్, పచ్చిమిర్చి - రెండు
పసుపు, జీలకర్ర పొడి - ఒక్కోటి అర టీస్పూన్, నూనె, ఉప్పు, చీజ్ - సరిపడా
తయారీ :
మిక్సీజార్లో బటానీలు, పనీర్, అల్లం, పచ్చిమిర్చి వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో శనగపిండి, చీజ్, పసుపు, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. పాన్ వేడి చేసి రెడీ చేసుకున్న ఈ పిండి మిశ్రమాన్ని దోశలా పోయాలి. రెండు వైపులా కాల్చుకుంటే సరి.
మటర్ ఖీర్
కావాల్సినవి :
బటానీలు - అర కప్పు
పాలు - అర లీటర్
యాలకులు - ఐదు
పిస్తాపప్పులు, ఎండుద్రాక్షలు - పదేసి చొప్పున
నెయ్యి - నాలుగు టేబుల్ స్పూన్లు
చక్కెర, బాదం తరుగు - సరిపడా
తయారీ :
బటానీలను ఉడికించి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాన్ వేడి చేసి ఆ బటానీ పేస్ట్ వేసి పాలు పోసి కలపాలి. ఆ మిశ్రమాన్ని దగ్గర పడేవరకు ఉడికించాలి. ఆ తర్వాత చక్కెర, యాలకుల పొడి, ఎండుద్రాక్ష, పిస్తాపప్పులు వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాల తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని బాదం తరుగు చల్లుకుంటే తినడమే తరువాయి.
