పుతిన్​తో ప్రిగోజిన్‌‌‌‌ సమావేశం.. పాల్గొన్న 35 మంది వాగ్నర్ గ్రూప్ కమాండర్లు

పుతిన్​తో ప్రిగోజిన్‌‌‌‌ సమావేశం.. పాల్గొన్న 35 మంది వాగ్నర్ గ్రూప్ కమాండర్లు

మాస్కో : రష్యా ప్రెసిడెంట్​ పుతిన్​తో  వాగ్నర్ గ్రూపు చీఫ్​ ప్రిగోజిన్​ భేటీ అయ్యారు. తిరుగుబాటు ప్రకటించిన తర్వాత ఐదు రోజులకు జూన్​29న రష్యా అధ్యక్ష నివాసం క్రెమ్లిన్​లోనే ఈ సమావేశం జరిగినట్టు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్​సోమవారం వెల్లడించారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రిగోజిన్​తోపాటు 35 మంది వాగ్నర్ గ్రూప్ కమాండర్లు కూడా పాల్గొన్నట్లు చెప్పారు. సమావేశంలో ఉక్రెయిన్‌‌‌‌ యుద్ధభూమిలో వాగ్నర్ గ్రూప్ చర్యల గురించి ప్రధానంగా చర్చించారని వెల్లడించారు.

అలాగే యుద్ధంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి వాగ్నర్ గ్రూప్‌‌‌‌కు పుతిన్ పలు సూచనలు చేసినట్లు వివరించారు. తిరుగుబాటుకు దారి తీసిన పరిస్థితులను వాగ్నర్ గ్రూప్ కమాండర్లు పుతిన్‌‌‌‌కు వివరించారని, తిరుగుబాటు ప్రకటించిన రోజు జరిగిన ఘటనల గురించి చర్చించారన్నారు. అయితే అధ్యక్షుడిని టార్గెట్​గా పెట్టుకొని తిరుగుబాటు చేయలేదని, రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, మిలిటరీ చీఫ్ జనరల్ వాలెరీ గెరాసిమోవ్‌‌‌‌లను తొలగించాలనే ఈ ప్రయత్నం చేసినట్లు చెప్పినట్లు తెలిసింది.