
పారిస్: ఇండియా స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో సూపర్ పెర్ఫామెన్స్ చేస్తోంది. మెగా టోర్నీలో ఆరోసారి మెడల్ నెగ్గి సిక్సర్ కొట్టేందుకు అడుగు దూరంలో నిలిచింది. వరల్డ్ రెండో ర్యాంకర్‌కు చెక్ పెట్టిన సింధు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మిక్స్‌డ్ డబుల్స్ జోడీ ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో కూడా క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో 15వ ర్యాంకర్ సింధు 21-–19, 21–-15తో రెండో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా)పై అద్భుత విజయం సాధించింది.
గాయాలు, ఫామ్ కోల్పోయి కొన్నాళ్లుగా నిరాశ పరుస్తున్న సింధు ఈ టోర్నీలో మాత్రం అంచనాలకు మించి ఆడుతోంది. ప్రస్తుతం తనకంటే ఎంతో మెరుగైన వాంగ్ జిని కేవలం 48 నిమిషాల్లోనే చిత్తు చేసింది. చైనా షట్లర్‌పై హెడ్ టు హెడ్ రికార్డును 3-–2కి మెరుగుపరుచుకుంది.ఈ ఏడాది ఆరంభంలో సుదిర్మన్ కప్‌లో తనను ఓడించిన వాంగ్‌పై తెలుగు షట్లర్ ప్రతీకారం తీర్చుకుంది. ఆట ఆరంభం నుంచే ఆకట్టుకున్న సింధు తొలి గేమ్‌లో వేగంగా ఆడుతూ 11-–6 ఆధిక్యం సంపాదించింది.
బ్రేక్ టైమ్ తర్వాత వాంగ్ పుంజుకుంది. పదునైన స్మాష్‌లు, నెట్ విన్నర్లు కొట్టిన చైనా అమ్మాయి 19–-19 తో స్కోరు సమం చేసింది. అయినా, సింధు చివరి నిమిషంలో సంయమనం కోల్పోకుండా గేమ్‌ను గెలిచింది. రెండో గేమ్‌లో కూడా ఇండియా ప్లేయర్ ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
11–6తో బ్రేక్‌కు వెళ్లింది. ఆటలో పుంజుకునే ప్రయత్నంలో చైనా ప్లేయర్.. లాంగ్ ర్యాలీలతో సింధు ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసింది. ఒక దశలో 57 షాట్ల ర్యాలీ ఆడి సింధు సహనానికి పరీక్ష పెట్టింది. కానీ, సింధు దూకుడు పెంచి గేమ్‌తో పాటు మ్యాచ్ ముగించింది. క్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో ర్యాంకర్ పుత్రీ కుసుమ వార్దాని (ఇండోనేసియా)తో తలపడనుంది.
ఈ మ్యాచ్ గెలిస్తే సింధు మెడల్ ఖాయం చేసుకొని ఆరోసారి వరల్డ్ చాంపియన్‌షిప్ మెడల్ సాధించిన షట్లర్‌గా రికార్డు సృష్టించనుంది. కాగా, మెన్స్ సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్ పోరు ముగిసింది. బుధవారం రాత్రి జరిగిన రెండో రౌండ్‌లో ప్రణయ్ 8–21, 21–17, 21–23తో రెండో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయాడు.
ధ్రువ్-తనీషా అదుర్స్
మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల– తనీషా క్రాస్టో జోడీ పతకం దిశగా ముందుకెళ్తోంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో ర్యాంకర్‌కు షాకిచ్చి ఔరా అనిపించింది. హోరాహోరీగా సాగిన పోరులో ధ్రువ్–తనీషా 19–-21, 21-–12, 21–-15తో టైటిల్ ఫేవరెట్ టాంగ్ చున్ మన్– సె యింగ్ సుయెట్ (హాంకాంగ్) జంటను ఓడించి సంచలనం సృష్టించింది.
63 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఇండియా జోడీ తొలి గేమ్ కోల్పోయినా అద్భుతంగా పుంజుకుంది. మెగా టోర్నీలో తొలిసారి పోటీ పడుతున్న ఇండియా జోడీ.. క్వార్టర్స్‌లో మలేసియాకు చెందిన నాలుగో ర్యాంకర్ చెన్ టాగ్ జియో–తొహ్ యి వీతో పోటీ పడనుంది.