
కౌలాలంపూర్: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు పేలవ ఫామ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా మలేసియా మాస్టర్స్ సూపర్–500 టోర్నీలోనూ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్‌లో సింధు 11–21, 21–14, 15–21తో ఎన్‌గుయెన్ తుయ్ లిన్హ్ (వియత్నాం) చేతిలో ఓడింది. గంటా 4 నిమిషాల మ్యాచ్‌లో సింధుకు సరైన ఆరంభం దక్కలేదు. రెండో గేమ్‌లో వ్యూహం మార్చి వరుస పాయింట్లతో హోరెత్తించినా డిసైడర్ మళ్లీ నిరాశపర్చింది. మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో హెచ్.ఎస్. ప్రణయ్ 19–21, 21–17, 12–16తో ఐదోసీడ్ కెంటా నిషిమోటో (జపాన్)పై సంచలన విజయం సాధించగా, మరో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ 23–21, 13–21, 21–11తో ఆరోసీడ్ లు గుయాంగ్ జు (చైనా)పై నెగ్గాడు.
ఇతర మ్యాచ్‌ల్లో కరుణాకరన్ 21–13, 21–14తో చో టియాన్ చెన్ (చైనీస్‌తైపీ)పై, ఆయుష్ షెట్టి 20–22, 21–10, 21–8తో బ్రియాన్ యంగ్ (కెనడా)పై నెగ్గారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో 21–18, 15–21, 21–14తో అద్నాన్ మౌలానా–ఇండా చాయా సారి జమిల్ (ఇండోనేసియా)పై గెలిచారు. అషిత్ సూర్య–అమృత ప్రముతేశ్ 10–21, 12–21తో జియాంగ్ జెంగ్ బాంగ్–వీ యాక్సిన్ చేతిలో, రోహన్ కపూర్–గద్దె రుత్వికా శివాని 10–21, 14–21తో గుయో జిన్ వా–చెన్ ఫాంగ్ హుయ్ (చైనా) చేతిలో, కరుణాకరన్–ఆద్య వారియత్ 15–21, 16–21తో వెరెల్ యుస్టిన్ ములియా–లిసా అయు కుసుమవతి (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవి చూశారు. విమెన్స్ సింగిల్స్ ఇతర మ్యాచ్‌ల్లో ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్, మల్విక బన్సోద్ కూడా ఓటమి పాలయ్యారు.