థాయిలాండ్ ఓపెన్ లో ఓడిపోయిన పీవీ సింధు

థాయిలాండ్ ఓపెన్ లో ఓడిపోయిన పీవీ సింధు

చాలా రోజుల తర్వాత ఆడిన మొదటి అంతర్జాతీయ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధు ఓటమి పాలైంది. యోనెక్స్‌ థాయిలాండ్‌ ఓపెన్‌ సూపర్ 1000 టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. మహిళల సింగిల్స్‌లో డెన్మార్క్‌ షట్లర్‌ మియా బ్లిక్‌ఫీల్డ్‌ చేతితో 21-16, 24-26, 13-21 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మొదటి గేమ్‌లో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన సింధు రెండో గేమ్‌లో ఓటమిపాలైంది. అయితే పోటాపోటీగా సాగిన రెండో గేమ్‌ ఆదిలో సింధు ఆధిపత్యంలో నిలిచింది. అయితే బ్లిక్‌ఫీల్డ్‌ రెట్టింపు ఉత్సాహంతో మ్యాచ్‌ను మూడో గేమ్‌కు తీసుకువచ్చింది. ఆఖరి గేమ్‌లో జోరును కొనసాగిస్తూ బ్లిక్‌ఫీల్డ్‌ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్‌ సాయి ప్రణీత్‌ కూడా తొలిరౌండ్‌లోనే వెనుదిరిగాడు. థాయ్ ప్లేయర్ వాంగ్‌ చరొయిన్‌ చేతిలో 16-21, 10-21 తేడాతో ఘోరంగా ఓడిపోయాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్‌- అశ్విన్‌ పొన్నప్ప విజయకేతనం ఎగురవేశారు. 21-11, 27-29, 21-16 తేడాతో ప్రత్యర్థి జోడీని చిత్తుచేశారు. అయితే థాయిలాండ్ ఓపెన్‌లో ఆడాల్సిన భారత క్రీడాకారులు సైనా నెహ్వాల్‌, కశ్యప్‌, ‌ ప్రణయ్ మ్యాచ్‌లకు దూరమయ్యారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో సైనా, ప్రణయ్‌ టోర్నీ నుంచి తప్పుకోగా.. కశ్యప్‌ క్వారంటైన్‌లో ఉన్నాడు.