Hong Kong Open: హాంకాంగ్ ఓపెన్ తొలి రౌండ్‌లో సింధుకు షాక్.. అన్‌సీడెడ్ చేతిలో ఓటమి

Hong Kong Open: హాంకాంగ్ ఓపెన్ తొలి రౌండ్‌లో సింధుకు షాక్.. అన్‌సీడెడ్ చేతిలో ఓటమి

ఇండియా స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధుకు హాంకాంగ్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న ఈ తెలుగు టాలెంటెడ్ ప్లేయర్.. మరోసారి నిరాశపరిచింది. తొలి రౌండ్ లోనే అనూహ్య ఓటమి చవి చూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. బుధవారం (సెప్టెంబర్ 10) మహిళల సింగిల్స్ విభాగంలో డెన్మార్క్‌ ప్లేయర్ లైన్ క్రిస్టోఫర్సన్ చేతిలో పోరాడి ఓడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో సింధు 21-15, 16-21, 19-21 తేడాతో ఓడిపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురి చేసింది. 

తొలి గేమ్ లో గెలిచి ఆధిపత్యం చూపించినప్పటికీ తర్వాత రెండు సెట్ లలో సామర్ధ్యం మేర రాణించలేకపోయింది. కీలక దశలో పాయింట్లు కోల్పోయి ఒత్తిడిలో చిత్తయింది. మరోవైపు డెన్మార్క్ ప్లేయర్ తొలి సెట్ ఓడిపోయినా అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చింది. ప్రత్యర్థి స్టార్ ప్లేయర్ అయినప్పటికీ చివరి రెండు సెట్ లలో పట్టుదలగా ఆడి గెలిచింది. మ్యాచ్ కు ముందు క్రిస్టోఫర్సన్ కు సింధుపై చెత్త రికార్డు ఉంది. అంతకముందు ఆడిన మూడు సార్లు ఈ డెన్మార్క్ ప్లేయర్ మూడు సార్లు ఓడిపోయింది.  అయితే ఎట్టకేలకు నాలుగో ప్రయత్నంలో క్రిస్టోఫర్సన్ విజయం సాధించింది. 

ఇతర భారత ఆటగాళ్ల విషయానికి వస్తే లక్ష్య సేన్, హెచ్‌ఎస్ ప్రణయ్, కిరణ్ జార్జ్ 16వ రౌండ్‌లోకి ప్రవేశించారు. డబుల్స్ లో స్టార్  ద్వయం చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి తొలి రౌండ్ దాటి రెండో రౌండ్ లోకి ప్రవేశించారు. తొలి రౌండ్ లో ఓడిపోయిన సింధు   సూపర్ 750 టోర్నమెంట్ చైనా మాస్టర్స్‌లో ఆడే అవకాశం ఉంది.