బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో సింధు బోణీ

బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో సింధు బోణీ

పారిస్‌‌: ఇండియా స్టార్‌‌ షట్లర్‌‌ పీవీ సింధు.. బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో బోణీ చేసింది. మంగళవారం జరిగిన విమెన్స్‌‌ సింగిల్స్‌‌ తొలి రౌండ్‌‌లో 15వ సీడ్‌‌ సింధు 23–21, 21–6తో కలయోనా నల్బంటోవా (బల్గేరియా)పై గెలిచింది. 39 నిమిషాల మ్యాచ్‌‌లో తొలి గేమ్‌‌లో సింధుకు గట్టి పోటీ ఎదురైంది. షాట్స్‌‌ పదేపదే మిస్‌‌ కావడంతో 0–4తో వెనుకబడింది. అయినప్పటికీ నల్బంటోవా ఆధిక్యం తగ్గకుండా 6–2, 7–5, 11–7తో ముందంజ వేసింది. బ్రేక్‌‌ తర్వాత సింధు వరుసగా స్మాష్‌‌లు కొడుతూ 12–12, 14–12 లీడ్‌‌లోకి వచ్చింది. 

తర్వాత 15–15తో స్కోరు సమం చేసిన నల్బంటోవా 19–17 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ క్రమంలో 20–20తో మరోసారి స్కోరు సమమైనా సింధు పట్టువదలకుండా డ్రాప్‌‌ షాట్స్‌‌ వేసి గేమ్‌‌ నెగ్గింది. రెండో గేమ్‌‌లో 5–1 తర్వాత సింధు దుమ్మురేపింది. వరుసగా 15 మ్యాచ్‌‌ పాయింట్లు కొట్టి గేమ్‌‌ను సొంతం చేసుకుంది. మెన్స్‌‌ సింగిల్స్‌‌లో హెచ్‌‌. ఎస్‌‌. ప్రణయ్‌‌ 21–18, 21–15తో జోకిమ్‌‌ ఒల్డార్ఫ్‌‌ (ఫిన్లాండ్‌‌)పై నెగ్గాడు. 47 నిమిషాల ఆటలో ఇండియన్‌‌ ప్లేయర్‌‌ స్థాయికి తగ్గ పెర్ఫామెన్స్‌‌ చూపెట్టాడు. మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌లో రోహన్‌‌ కపూర్‌‌–రుత్వికా శివాని 18–21, 21–16, 21–18తో లియోంగ్‌‌ లోక్‌‌ చోంగ్‌‌–ఎన్జీ వాంగ్‌‌ చీ (మకావ్‌‌)పై గెలిచారు.