- మనదేశ గ్యాస్ అవసరాల్లో 45 శాతం ఇక్కడి నుంచే సరఫరా
- వార్షిక సామర్థ్యం 12 మి.టన్నులు పతనం
- ఐదేళ్ల తరువాతే పూర్తిస్థాయిలో సరఫరా మొదలయ్యే అవకాశం
న్యూఢిల్లీ: ఒకటో రెండో దేశాలకు కాదు.. దాదాపు అన్ని దేశాలకూ గ్యాస్ కొరత తీవ్ర సమస్యలు సృష్టించనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్ మూతపడటంతో ఇంధన మార్కెట్లు తీవ్ర సంక్షోభంలో మునిగిపోయాయి. ఖతార్‌లోని రాస్ లఫాన్ ప్లాంట్ పై ఇరాన్ డ్రోన్ దాడులు జరగడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. గత మూడు దశాబ్దాల కాలంలో ఇక్కడ సరఫరా ఆగిపోవడం ఇదే తొలిసారి. ఇది పూర్తిస్థాయిలో పనిచేయడానికి ఐదేళ్లు పడుతుందని అంచనా.
దాడి కారణంగా ఏటా 12.8 మిలియన్ టన్నుల సామర్థ్యం తగ్గిపోయింది. ఇది ఖతార్ ఎల్ఎన్జీ ఎగుమతుల్లో 17 శాతం కావడం గమనార్హం. మన దేశానికి అవసరమైన మొత్తం ఎల్ఎన్జీ దిగుమతుల్లో సుమారు 47 శాతం ఇక్కడి నుంచే వస్తుంది. గత ఏడాది ఇండియా సుమారు 11.37 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) గ్యాస్ ను ఈ ప్లాంట్ నుంచి దిగుమతి చేసుకుంది. పెట్రోనెట్ ఎల్ఎన్జీ సంస్థ ప్రతి ఏటా 8.5 ఎంఎంటీ గ్యాస్ సరఫరా కోసం ఖతార్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
కరెంటు తయారీకి ఇబ్బందులు
గ్యాస్ కొరత వల్ల విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. ఎరువులు, వస్త్ర పరిశ్రమలు మూతపడుతున్నాయి. యుద్ధం వల్ల ఇంధన సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది. హార్మూజ్ జలసంధి మూతపడటంతో పెట్రోల్, విమాన ఇంధనం ధరలు పెరుగుతున్నాయి. భారత్ లో వంటగ్యాస్ కొరత ఇబ్బందులు సృష్టిస్తోంది. మొదట్లో వాణిజ్య గ్యాస్ సరఫరాను పూర్తిగా నిలిపివేసినా ఇప్పుడు అవసరంలో ఐదో వంతు మాత్రమే ఇస్తున్నారు.
డీజిల్, ఎరువుల కొరతతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పాకిస్థాన్ తన ఎల్ఎన్జీ అవసరాల కోసం 99 శాతం ఖతార్ పైనే ఆధారపడుతోంది. ఏప్రిల్ మధ్య నుంచి అక్కడ విద్యుత్ కోతలు పెరిగే అవకాశం ఉంది. వియత్నాం, ఫిలిప్పీన్స్ కొత్త కొనుగోళ్లను నిలిపివేసాయి. యూరప్ దేశాలకూ ఇక్కట్లు తప్పడం లేదు. ఆసియాకు వెళ్లే ఒక్కో గ్యాస్ షిప్ ధర ఇప్పుడు రూ.670 కోట్లకు చేరింది. యుద్ధానికి ముందు ఉన్న ధరతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ.
పెరుగుతున్న బొగ్గు వాడకం
గ్యాస్ కొరత కారణంగా భారత్ లో బొగ్గు వినియోగం ఈ ఏడాది రికార్డు స్థాయికి చేరవచ్చని అంచనా. అమెరికా, ఆస్ట్రేలియా నుంచి గ్యాస్ సరఫరా పెంచాలని ఆసియా దేశాలు కోరుతున్నాయి. రష్యా కూడా చైనాకు తన ఎల్ఎన్జీ ఎగుమతులను పెంచే ప్రయత్నంలో ఉంది. యూరప్ దేశాలు గ్యాస్ కొరతను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నాయి. రాబోయే ఐదేళ్ల వరకు కొన్ని కాంట్రాక్టులపై ప్రభావం పడేలా కనిపిస్తోంది.
సంపన్న దేశాలు ఎక్కువ ధర చెల్లించి గ్యాస్ కొనుగోలు చేస్తుంటే పేద దేశాలు మార్కెట్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జపాన్, దక్షిణ కొరియా కూడా తమ విద్యుత్ అవసరాల కోసం బొగ్గు వాడకాన్ని పెంచుతున్నాయి. ఈ సంక్షోభం రష్యా ఉక్రెయిన్ యుద్ధం కంటే భారీ ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
