లాక్ డౌన్ ఎఫెక్ట్.. క్వార్టర్ మందు రూ. 1,000

లాక్ డౌన్ ఎఫెక్ట్..  క్వార్టర్ మందు రూ. 1,000

లాక్ డౌన్ తో బ్లాకులో జోరుగా సేల్స్
మందు కోసం జనం తండ్లాట
డోర్ డెలివరీ పేరిట భారీగా మోసాలు
సోదాల్లో పట్టుబడుతున్నలిక్కర్

లాక్డౌన్ కారణంగా మందు బంద్ అవడంతో.. లిక్కర్ తాగే అలవాటు ఉన్నవాళ్లు తండ్లాడుతున్నారు. మందు ఎక్కడైనా దొరుకుతుందా అని
తెలిసినవారినల్లా ఆరా తీస్తున్నారు. పండుగలకు పబ్బాలకు తెచ్చిన మందు ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. బ్లాక్ లో దొరుకుతుందని
ఎవరైనా చెప్తే చాలు.. ‘‘ఎక్కడా ..? అడ్రస్ ఇవ్వు. ఎంత రేటైనా ఫర్లేదు’’ అని అంటున్నారు. రాష్ట్రంలో ప్రతి వంద మందిలో 70 మందికి లిక్కర్ తాగే అలవాటు ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. లాక్ డౌన్ సమయంలో అందరూ ఇంటికే పరిమితం కావడం, ఖాళీ సమయం అధికంగా
ఉండటంతో మందు ఉంటే బాగుండని చాలా మంది భావిస్తున్నారు. ఈ పరిస్థితి సాధారణ వ్యక్తుల్లోనే కాదు.. వివిధ హోదాల్లో ఉన్నవాళ్లలో,
రాజకీయ నాయకుల్లోనూ ఉంది.

హైదరాబాద్, వెలుగు: మద్యం అమ్మకాలపై నిషేధం అమలులో ఉండటం.. లిక్కర్ కు జనంలో డిమాండ్ ఉండటంతో కొందరు వైన్ షాపు యజమానులు బ్లాక్ మార్కెట్ కు తెరతీశారు. డబుల్ , ట్రిపుల్ రేట్లకు మందును అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. మామూలు రోజుల్లో వెయ్యి రూపాయల ధర ఉండే లిక్కర్ బాటిల్ ను ఇప్పుడు రూ. 3 వేలకుపైనే అమ్ముతున్నారు. అది కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారం నడిపిస్తున్నారు. వైన్ షాపు పరిసరాల్లో కాకుండా రెండు మూడు కి.మీ దూరంలో తమ ఏజెంట్లను పెట్టుకొని గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు సాగిస్తున్నారు. కస్టమర్లతో ఫోన్లలో మాట్లాడుతూ.. ఫలానాచోట మందు ఉంటుందని, ఫలానారేటు అని చెబుతున్నారు. కొందరైతే ముందే తమ అకౌంట్లలో ఆన్ లైన్ డబ్బులు వేయించుకొని ఆ తర్వాత మందును గప్ చుప్ గా అందజేస్తున్నారు. స్థానికంగా ఉండే కొందరు లీడర్ల సహకారంతో ఈ మద్యం అక్రమ దందాను నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2216 వైన్ షాపులు ఉన్నాయి. ఈ షాపుల్లో లాక్ డౌన్ ప్రకటించే నాటికి మద్యం నిల్వలు ఉన్నాయి. అందులో నుంచి ఇప్పటి వరకు 80 శాతం మద్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసినట్లు అధికార వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, పల్లెల్లో బెల్ట్ షాపుల్లో లిక్కర్ రేట్లు భారీగా పెరిగాయి. రూ. 100 క్వార్టర్ బాటిల్ ను రూ. 500, రూ. 1000కు అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

పట్టుపడుతున్న లిక్కర్
చాలా ప్రాంతాల్లో పేరుకే వైన్ షాపులు మూసి ఉంటున్నాయి. ఎవరూ లేని సమయంలో షాపుల తలుపులు తీసి.. అందులో నుంచి లిక్కర్ ను షాపు యజమానులు రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలా తరలించిన మందును తెలిసిన వారి ద్వారా అమ్ముతున్నారు. ఈ తరలించే టైంలో కొందరు, అమ్మకాలు సాగించే టైంలో మరికొందరు పోలీసులకు దొరికిపోతున్నారు. ఈ మధ్య హైదరాబాద్ శివారులోని ఓ వైన్ షాపు నుంచి అర్థరాత్రి లిక్కర్ బయటికి తీస్తున్న సమయంలో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

హోం డెలివరీ పేరిట మోసాలు
లిక్కర్ ను హోం డెలివరీ చేస్తామంటూ కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
‘‘ఇక్కడ ఇచ్చిన ఫోన్ నంబర్ కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు పంపండి. ప్రీమియం, స్కాచ్‌ విస్కీలను హోం డెలవరీ అందుకోండి’’ అంటూ ఫేస్ బుక్ లో, వాట్సప్ యాపులలో పోస్టులు పెడుతున్నారు. వీటిని చూసి వారు టెంప్ట్ అవుతున్నారు. ఇంటికే మందు వస్తుందనే ధీమాతో ఆ ప్రకటనల్లోని ఫోన్ నంబర్లకు ఆన్ లైన్ లో డబ్బులు పంపుతున్నారు. కానీ గంటల తరబడి ఎదురు చూసినా మందు డెలవరీ కావడం
లేదు. చివరికి ఆ ఫోన్ నంబర్ కు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ‘‘ప్రముఖ షాపులు, మాల్స్‌ పేరుతో ఈ యాడ్స్‌ను పోస్ట్‌‌ చేస్తున్నారు. వాటిలో ఇస్తున్న ఫోన్‌ నంబర్‌‌ను కాంటాక్ట్‌‌ చేస్తే డెబిట్‌ కార్డ్, ‌క్రెడిట్‌ కార్డ్, ఆన్‌లైన్‌ పేమెంట్‌లో ఏదో ఒకటి ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ప్రీమియం, స్కాచ్‌ లిక్కర్‌‌ మాత్రమే అవేలబుల్‌గా ఉందని, ఎమ్మార్పీ డబుల్‌రేట్‌, డెలివరీ చార్జీ ఇస్తేనే మందు ఇంటికి పంపుతామని నమ్మబలుకుతున్నారు. తీరా డబ్బులు పంపాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు” అని సైబర్ క్రైమ్ లో పనిచేసే ఓ పోలీసు అధికారి చెప్పారు.

కల్లుకు డిమాండ్
లిక్కర్ అమ్మకాలు లేకపోవడంతో పల్లెల్లో కల్లుకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఈత, తాటి చెట్ల నుంచి కల్లు పారే సమయం. వివిధ
ప్రాంతాల నుంచి జనం గుట్టుచప్పుడు కాకుండా కల్లు కేంద్రాలకు వెళ్లి కల్లును తెచ్చుకుంటున్నారు. నిత్యావసర సరుకుల కోసం బయటకు వస్తున్నట్లు చెబుతూ.. ఇంటికి కల్లు తెచ్చి పెట్టుకుంటున్నారు. అయితే కరోనా కట్టడి కోసం చాలా పల్లెలు ఇతర ప్రాంతాల్లోని వాళ్లకు కల్లును అమ్మడం లేదు. ఎవరినీ తమ ఊళ్లలోకి రానివ్వడం లేదు. అయితే అలాంటి ఊళ్లలో నుంచి కొందరు యువకులు తమ కోసం కల్లు
తెచ్చుకుంటున్నట్లు చెప్పి.. రహస్యంగా ఇతరులకు సరఫరా చేస్తున్నారు.

మందు బాటిళ్లతో కలెక్టర్కు దొరికిండు
ఆదిలాబాద్ కు చెందిన ఓ విద్యుత్ ఉద్యోగి కారులో అక్రమంగా మద్యం తరలిస్తూ జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనకు దొరికాడు. ఆదిలాబాద్ పట్టణంలోని కరోనా కంటెయిన్మెంట్ వార్డుల పరిశీలనలో భాగంగా కలెక్టర్ శుక్రవారం స్థానిక వినాయక్ చౌక్ గుండా వెళ్తుండగా ఓ కారును ఆపారు. కొద్ది దూరంలో కారును ఆపి డ్రైవర్ పరారయ్యాడు. కలెక్టర్ అక్కడికి చేరుకొని కారులో ఉన్న వ్యక్తిని ప్రశ్నించగా.. తన పేరు భూమన్న అని, తాను తలమడుగు మండలంలో లైన్ మెన్ గా పని చేస్తున్నానని వివరించాడు. కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో కారులో చెక్ చేయగా, మద్యం బాటిళ్లు దొరికాయి. ఎక్సైజ్ ఆఫీసర్లు అతడిపై కేసు నమోదు చేసి, మందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్ర ఖజానాలో లిక్కర్ వాటా ఎక్కువ
రాష్ట్ర ఖజానాకు లిక్కర్ ఆదాయం ప్రధాన వనరు. ప్రతి నెల వివిధ పన్నుల రూపంలో ఎక్సైజ్ శాఖ నుంచి రూ. 2,500 కోట్ల ఆదాయం వస్తుంటుంది. రోజూ ప్రభుత్వానికి లిక్కర్ నుంచి వచ్చే రూ. 83 కోట్ల ఆదాయం లాక్ డౌన్ వల్ల గండి పడిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రతి వేసవిలో మద్యం అమ్మకాలు ఎక్కువుంటాయి. మార్చి చివరి వారం నుంచి డిమాండ్ పెరిగి, ఏప్రిల్లో ఊపందుకుంటాయి. కానీ లాక్ డౌన్తో మార్చి నుంచి ఆదాయం పడిపోయిందని ఎక్సైజ్ శాఖ వర్గాలు అంటున్నాయి. లిక్కర్ అమ్మకాలను చాలా కాలం నిలిపి వేయడం వల్ల భవిష్యత్ లో తాగేవాళ్లలో మార్పు వచ్చే అవకాశం ఉందన్న చర్చ కూడా నడుస్తోంది. ‘‘మద్యం లేకున్నాబతకగలం అనే ఫీలింగ్ వస్తే మద్యం జోలికి పోరు. అలవాటు తప్పిన వారు మళ్లీ అలవాటు పడాలంటే టైమ్ పడుతది. ఇది రాష్ట్ర ఆదాయానికి ఇబ్బందే’’ అని ఓ సీనియర్ ఆఫీసర్ అభిప్రాయపడ్డారు.

For More News..

నిత్యావసర సరుకుల కోసం జనం తిప్పలు