బిహార్ ఎన్నికల్లో ఏం జరిగింది ? అక్కడ ప్రజలే ఓటు వేశారా లేక ఎన్నికల కమిషన్ ఓటు వేసిందా ? లేదా సముద్రంలో చేయి ముంచితే సముద్రమంతా పెట్రోల్ చేయగలిగిన మాంత్రికులు ఓట్లు మిషన్లలో ఓటువేసి ఇప్పుడు మనముందున్న ఫలితాలను తెచ్చారా? ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వాన్ని వాస్తవంగా ఎవరు నడుపుతారు? నితీశా, సనాతన ధర్మమా? ఈ దేశంలో ధర్మ, అధర్మం మూల అర్థాలు ఎల్లప్పుడు ఒక్క తీరుగానే ఉన్నాయా ? వాటిని కుల, మత వ్యవస్థలు మన అవసరాలకు అనుగుణంగా మారుస్తున్నాయా? ఇవన్నీ ప్రశ్నలే.
అయితే, ఈ దేశంలో ప్రశ్నలు అడగడమేమిటి? ప్రశ్నలు అడగడమనేది శూద్రరాజ్యంలో కదా! ఇది శూద్రరాజ్యం కాదే, ఇక్కడ ప్రశ్నలడిగి ఈ దేశాన్ని ప్రశ్నలమయం చేయాలనుకుంటున్నారా! ఇది నమ్మకాల దేశం కదా! ఈవీఎంలు కూడా నమ్మకం మీద నడుస్తాయి కదా! నమ్మకమనేది ఇహలోక వనరులను, పరలోక సుఖజీవన నిరంతత్వాన్ని ఇస్తాయి కదా! అనే సామాజిక శాస్త్రం ఈ దేశంలో నాలుగు పాదాల మీద నడుస్తున్నది.
అ యినా బిహార్ కథను మనం కాలచక్రంలో భాగంగానే పరిశీలిద్దాం. ఇక్కడ కూడా కొన్ని భౌతిక మార్పులు కొన్ని తాత్విక మార్పులు జరిగే అవకాశమున్నది. నితీశ్ ఒక ప్రాంతీయ అవతార పురుషుడు. ఆయన ఒకసారి అర్జునుడు అవుతాడు. ఒకసారి దుర్యోధనుడు అవుతాడు. మరొకసారి నారదుడు కూడా అవుతాడు. ఒక్కొక్కసారి తన మిత్ర పక్షానికి తలనొప్పి, శత్రుపక్షాన్ని అతి సంతోషపెడతాడు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 20 ఏండ్లు అధికారంలో ఎవరూ లేరు. ఆయన ఉన్నారు. కొద్దిరోజులు ఒక మహాన్జీని మాంత్రికుడుగా ఉంచి, మళ్లీ తనే మంత్రదండన చేపట్టారు. నితీశ్ చాలా స్వింగ్ యాక్షన్లు చేశాడు. అయితే, ఇకముందు అది సాధ్యమా!
కులగణన
నితీశ్ అటు దేవతలపై, ఇటు రాక్షసులపై కోపానికొచ్చిన నారదునిలా కులగణన చేశాడు. అప్పుడు ఆయన బద్దశత్రువు లాలూ లాలనలో ఉన్నాడు. తన కుర్మికులం అతి చిన్నదని 2.87శాతం (37,62,967) కూడా ఆ పని చేశాడు. అయినా ఆ రాష్ట్రంలో అది మన రెడ్లులాగ బలమైన వ్యవసాయిక కులం. వారు కూడా ఒకప్పుడు మేం క్షత్రియులం అని పోజు కొట్టారు.
కానీ, రాజ్పుత్రులు వారిని తమ కులంతో ఎప్పుడూ సమానంగా చూడలేదు. ఇప్పుడు ఓబీసీలోనే ఉన్నారు. ఆయన లెక్కల్లోనే యాదవులు అతిపెద్ద బీసీ కులమని తేలింది. అయినా లెక్కలు పూర్తిగా బయటపెట్టాడు నీతీశ్. అప్పుడు ఆయన మహా విష్ణువుతో పగతో ఉన్నాడు. ఆయన బయట పెట్టిన కులగణన లెక్కలు దేశాన్ని అబ్బురపరిచాయి. అప్పటికీ, ఇప్పటికీ ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వివరంగా కులగణన లెక్కలు బయటపెట్టలేదు.
తెలంగాణ ప్రభుత్వం లెక్కలు చేయించింది కానీ పూర్తి వివరాలు ఇప్పటికీ బయటపెట్టలేదు. ఈ నారద విశ్వరూపం చూసి ఆయనను బెదిరింపచూసిన బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఆయనను దువ్వి మళ్లీ తమలో లీనం చేసుకున్నారు. తమ దేశంలో కులాల సెన్సెస్ చేయిస్తామని తరువాత చాలా కాలానికి ప్రకటించారు. నితీశ్ నారదతత్వం ఎన్నికల్లో కొంత పనిచేసింది. కనీసం, తమ లెక్కలు, తమ ఆర్థికస్థితి తమకు చెప్పినందుకు ఆయనకు ఈ ఎన్నికల్లో కొంతమేలు చేశాయి. ఆ విషయంలో ప్రజలు ఆయన్ని నమ్మారు.
స్త్రీలకు రూ. పదివేల ప్రసాదం
ఆకలితో ఉన్నవారికి, ముఖ్యంగా పిల్లల కడుపులు ప్రతినిత్యం తట్టిచూసే తల్లికి ఎన్నికల ముందు బీద స్త్రీల అకౌంట్లోకి రూ.10వేలు ప్రసాదంలా పంచాడు నారదుడు. దీనికి అంతకుముందు ప్రసాదంలా ప్రజలకు డబ్బు పంచిపెట్టవద్దనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ జై కొట్టడమే కాకుండా, ప్రతి సంవత్సరం ప్రతి బిహారీ స్త్రీకి రూ.10వేలు ఇస్తామని తన కొత్త ప్రసాద ప్రమాణం చేశాడు. ఈ పదివేల రూపాయలు బిహార్లో ముస్లిం స్త్రీలకు ఇచ్చారో లేదో తెలియదు. 2024 ఎన్నికల ముందు ప్రధాని, హోం మంత్రి కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలన్నీ హిందువుల దగ్గర డబ్బు గుంజుకొని స్త్రీలకు పంచుతారని చెప్పగా విన్నాం.
బిహార్లో అతి బీద ముస్లింల సంఖ్య చాలా ఎక్కువ. వారిలో చాలామంది పేర్లు ఓటరు లిస్టుల్లో మిస్ అయ్యాయనే వార్తలు వచ్చాయి. అటువంటప్పుడు రూ.10వేల ప్రసాదం వాళ్లకు ఇవ్వకపోతే నితీశ్‌లో షియావాదం ఏమైనట్టు? ఏది ఏమైనా బిహార్‌ది ఒక కొత్త కథ. అది ప్రజాస్వామ్యంలో వెల్ఫేర్ వాదాన్ని ఒక కొత్త మలుపుకైతే తిప్పింది. ఇది దేశాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తుంది.
బ్యాంకు ఖాతా ప్రసాదం ఇతర రాష్ట్రాల్లో కూడా..
నాలుగు రోజుల క్రితం ఔట్లుక్ రిపోర్టరు నాకు భోపాల్ నుంచి ఫోన్ చేశాడు. ఒక ఐదు నిమిషాలు మీతో మాట్లాడవచ్చా అని అడిగాడు. ఎస్ అన్నాను. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతి నెల ఒక్కో స్త్రీకి 1500 రూపాయలు బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇదే స్కీమును బీజేపీ చత్తీస్ గఢ్ రాష్ట్రానికి కూడా ఎక్స్టెండ్ చేస్తుందని నాయకులు చెబుతున్నారు.
మీరేమంటారు అని అడిగాడు ఆ రిపోర్టరు. 2024 ఎన్నికల క్యాంపెయిన్‌లో కాంగ్రెస్ ఇచ్చిన మనీ ట్రాన్స్ఫర్ పాలసీని బీజేపీ వ్యతిరేకించింది. పెట్టుబడిదారులకు కాంట్రాక్టు డబ్బును తగ్గించాలంటే, ఈ వ్యవస్థలో అతి బీదలుగా మారిన ప్రజలకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయడమే ప్రజాస్వామ్య పద్ధతి.
క్రోనీ క్యాపిటలిజంకు కొంతైనా చెక్ పెట్టాలంటే బీజేపీకి కూడా డబ్బు పంచడమే మార్గం. ఇప్పుడు అది మొదలైంది. మంచిదే అని చెప్పాను. క్రోనీ క్యాపిటలిజం అతి కొద్దిమంది చేతిలో వేల కోట్లు పెడుతుంది. బీదలు మరింత బీదలు అవుతారు. దేశ బడ్జెట్, రాష్ట్రాల బడ్జెటులో ప్రజల వాటా వారికి ముట్టాలంటే వారికి కొంత డబ్బును బ్యాంకు అకౌంటులోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు లంచాలు లేకుండా ఆ డబ్బు ప్రజలకు అందుతుంది. దాన్ని ప్రజలు వెంటనే మార్కెటులో ఖర్చు పెడతారు. మార్కెట్ నుంచి మళ్లీ ప్రభుత్వాలకు జీఎస్టీ ద్వారా డబ్బు వస్తుంది. గ్రామ మార్కెట్లు కూడా ప్రజలు చేసే కొనుగోలుతో బాగా పెరుగుతాయి.
బీజేపీ ఈ స్కీములకు ఎందుకు మరలింది?
భారతదేశంలోని కమ్యూనిస్టు పార్టీలలాగే ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు కూడా వెల్ఫేర్ ఎకానమీని వ్యతిరేకించేవి. బీజేపీ నాయకులు కూడా చాలాకాలం వెల్ఫేర్ డిస్ట్రిబ్యూషన్ సోషలిస్టు పద్ధతిగా భావించేవారు. కానీ గత కొంతకాలంగా కిసాన్ యోజన కింద బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.6000 మూడు విడతలుగా రైతు ఖాతాల్లోకి ట్రాన్సఫర్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం తెలంగాణలో బీఆర్ఎస్ రైతుబంధు మనీ ట్రాన్స్ఫర్ మొదలుపెట్టాక కేంద్ర కిసాన్ కార్యక్రమం మొదలుపెట్టింది.
ఇప్పుడు బిహార్లో రూ.10వేలు అతిపెద్ద డబ్బు ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్. ఈ స్కీము కూడా నితీశ్ బీజేపీపై రుద్దాడు. కులగణన, డబ్బు ట్రాన్స్ఫర్ మెచ్చుకోదగ్గ ప్రోగ్రాములే. అయితే ఎన్నికల ముందు ఇలా పంచి నేరుగా బిహార్ స్త్రీలను ఓటు బూత్‌కు రప్పించారు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ కూడా రైతుబంధు డబ్బు బ్యాంకు ఖాతాల్లోకి పంపి ఓటు వేయించుకున్నాడు.
తెలంగాణ ఆరు గ్యారంటీలు
తెలంగాణలో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చి గెలిచింది. ఒకవైపు పెట్టుబడిదారులు వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే ప్రజలు ఆకలికి మాడటం ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకం. అమెరికాలో జోహరాన్మమ్దానీ అక్కడి మొనోపలి క్యాపిటలిస్టులకు వ్యతిరేక ఎజెండాగా బీదరికంలో ఉన్న ప్రజలకు ఉచితాలను అందించకపోతే ప్రజాజీవనం నాశనం అవుతుంది అని భావించాడు. జోహరాన్ న్యూయార్క్లో ప్రజలకు ఇచ్చిన హామీలు చూసి ట్రంప్ బీదలకు 200 డాలర్లు పంపిణీ చేస్తానంటున్నాడు. ఇవన్నీ క్రోనీ క్యాపిటలిజానికి విరుగుడు. వీటినే సోషలిస్టు డెమొక్రటిక్ ఎకనామిక్ స్కీములు అంటున్నాం. ఈ రకమైన ఆర్థిక విధానాలకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆరాధ్యుడు.
ఇంగ్లిష్ మీడియం పెరగాలి
దేశంలో అతి బీద రాష్ట్రం బిహార్. అన్ని రకాల వెల్ఫేర్ స్కీముల ద్వారా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. నితీశ్ ఇంగ్లిష్ మీడియం విద్యకు వ్యతిరేక విధానం ఉత్పత్తి కులాల్లో బలమైన మేధావి వర్గాన్ని ఎదగనివ్వలేదు. ఆర్జేడీ కూడా ఇంగ్లిష్ విద్యకు వ్యతిరేకం. కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో తెలంగాణలోలాగ ఇంగ్లిష్ మీడియం కోసం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.
ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెఫర్డ్
