- 60 శాతం మంది తిరిగి చెల్లించలేకపోతున్నారని అంచనా
- ఫైనాన్షియల్ సంస్థలు వేధిస్తే లీగల్‌గా రక్షణ పొందొచ్చు
- బారోవర్లకు దన్నుగా నిలుస్తున్న వివిధ చట్టాలు
న్యూఢిల్లీ: లక్షలాది మంది భారతీయులు అప్పుల వలలో చిక్కుకుంటున్నారు. కలలను సాకరం చేసుకోవడానికి అప్పులపై ఆధారపడుతున్నారు. డిజిటల్ లోన్లు, క్రెడిట్ కార్డులు సులభంగా లభిస్తుండడంతో ఇండియాలో కుటుంబాల అప్పులు భారీగా పెరిగాయి. బారోవర్లు (అప్పులు తీసుకున్నవారు) అధిక వడ్డీలు చెల్లించడానికి నానా తంటాలు పడుతున్నారు. ఆర్‌బీఐ డేటా ప్రకారం, 2024–25 నాటికి ఇండియాలో కుటుంబాల అప్పులు రూ.15.7 లక్షల కోట్లకు పెరిగాయి. ఇది 2019–20 లో నమోదైన రూ.7.5 లక్షల కోట్లతో పోలిస్తే 102 శాతం ఎక్కువ. ఇందులో పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డు లోన్లే ఎక్కువగా డీఫాల్ట్ అవుతున్నాయి.
అప్పులు చెల్లించలేక..
ఎక్స్‌పర్ట్ ప్యానెల్ సర్వే చేసిన 10 వేల మందిలో 60శాతం మంది బారోవర్లు కనీస చెల్లింపులు మాత్రమే చేస్తున్నారు లేదా పూర్తిగా ఆపేశారు. ఈఎంఐలు కుటుంబ ఆదాయం మొత్తాన్ని తినేస్తుండగా, 40శాతం మంది మాత్రం బతకడానికి కొత్త అప్పులు తీసుకోవాల్సి వస్తోంది. ఈ విధంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఉద్యోగం పోవడం వల్ల 31శాతం మంది అప్పులు తీర్చలేకపోయారని తేలింది. శాలరీ తక్కువ, ఈఎంఐలు ఎక్కువ కావడం వల్ల 28శాతం మంది, వైద్యపరమైన అత్యవసరాల వల్ల19 శాతం మంది లోన్ తీర్చలేకపోయామని చెప్పారు. దీంతో 20శాతం మందికి లీగల్ నోటీసులు వచ్చాయి. 35 శాతం మంది వేధింపులకు గురయ్యారు. 17 శాతం మంది తీవ్రమైన బెదిరింపులు ఎదుర్కొన్నారు.
కనిపించని చార్జీలతో..
చాలా లోన్ యాప్‌లు బారోవర్ల నుంచి అధిక వడ్డీని, హిడెన్ చార్జీలను వసూలు చేస్తున్నాయి. అంతేకాకుండా లోన్ రికవరీలో ఆర్‌బీఐ రూల్స్‌ను ఉల్లంఘిస్తున్నాయి. సాధారణంగా బారోవర్ నుంచి లోన్‌ను రికవరీ చేసేటప్పుడు ఫైనాన్షియల్ సంస్థలు మొదటి నెలలో రిమైండర్లు పంపుతాయి. రెండో నెలలో విపరీతంగా కాల్స్ చేస్తాయి. మూడో నెల నుంచి ఏజెన్సీల ద్వారా బెదిరింపులకు దిగుతున్నాయి. దీంతో బారోవర్లు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
లీగల్ ప్రొటెక్షన్..
బారోవర్లు రికవరీ ఏజెంట్ల వేధింపుల నుంచి లీగల్‌గా రక్షణ పొందొచ్చు. అప్పులిచ్చేటప్పుడు ఫైనాన్షియల్ సంస్థలు ఆర్‌బీఐ ‘ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్, డిజిటల్ లెండింగ్’ గైడ్‌లైన్స్‌ను ఫాలో కావాలి. పారదర్శకతను పాటించాలి. సంస్థలు లోన్ రికవరీలో గూండాలను వాడడం, బలవంతం చేయడం వంటివి చట్ట విరుద్ధం. కన్జూమర్ ప్రొటెక్షన్ చట్టం బారోవర్లను వినియోగదారులుగా గుర్తించి వేగవంతమైన పరిష్కారం కల్పిస్తోంది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) ప్రకారం, అప్పుల రికవరీలో లెండర్లు లేదా ఏజెంట్లు లిమిట్ దాటితే వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టొచ్చు.
సర్ఫేసీ చట్టం కింద బారోవర్లు 60 రోజుల నోటీసును ఛాలెంజ్ చేయొచ్చు. ఉషరస్ లోన్స్ చట్టం కింద అధిక వడ్డీని ప్రశ్నించే అవకాశం ఉంది. తప్పుడు క్రెడిట్ రిపోర్టింగ్‌ను సరిచేసే హక్కు కూడా ఉంది. బారోవర్లు లీగల్ సపోర్ట్‌తో వన్ టైమ్ సెటిల్‌మెంట్ చేసుకోవచ్చు. దివాలా చట్టం కింద వ్యక్తిగత ఇన్సాల్వెన్సీ దాఖలు చేసి అప్పులపై మారటోరియం (వాయిదా) పొందొచ్చు. మరింత సాయం కోసం cms.rbi.org.inను లేదా కన్జూమర్ హెల్ప్‌లైన్ 1800–11–4000ను సంప్రదించవచ్చు.
