డబుల్ బెడ్ రూం ఇళ్ల ఇప్పిస్తామని మోసం..4వేల మంది నిరుపేదలనుంచి కోట్లు దోచుకున్న మోసగాళ్లు

డబుల్ బెడ్ రూం ఇళ్ల ఇప్పిస్తామని మోసం..4వేల మంది నిరుపేదలనుంచి కోట్లు దోచుకున్న మోసగాళ్లు

ఇండ్లు లేని నిరుపేదలకు  డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామని ఆశ చూపారు.. ఇల్లు లేదు కదా అంతో ఇంతో ఇస్తే గూడు  దొరుకుతుందని అనుకున్న పేదలనుంచి వేలాది రూపాయలు దండుకున్నారు. వారిని నమ్మించేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఇండ్లు ఏవీ అని అడిగితే కలెక్టర్ దగ్గరకు వెళదాం.. మా వెనక పెద్ద పెద్దోళ్లు ఉన్నరు.. ఇండ్లు వస్తయ్ అంటూ కాలం వెల్లదీశారు. దీంతో విసిగిపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించిన ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బాలాపూర్ మండలం కుర్మల్ గూడ ఇందిరానగర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. 

కుర్మల్ గూడ ఇందిరానగర్ ప్రాంతంలో  మహబూబాబాద్, వికారాబాద్ జిల్లాలనుంచి బతుకుదెరువుకోసం వచ్చి నిరుపేదలు జీవనం సాగిస్తున్నారు.అదే ప్రాంతానికి చెందిన కళ్లెం అంజయ్య, సునీల్, మరికొంత మంది కలిసి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని చెప్పి వేలాది రూపాయలు వసూలు చేశారు. ఒక్కొక్కరి నుంచి 40 వేల నుంచి 60 వేల వరకు దాదాపు 4 వేల మంది నుంచి  కోట్లాది రూపాయలు వసూలు చేశారు.

డబ్బులు వసూలు చేశారు.. డబుల్ ఇండ్లు ఏవి అని అడిగితే .. ఇదిగో ఇస్తాం.. అదిగో ఇస్తాం అంటూ దాట వేస్తూ వచ్చారు. డబ్బులు తీసుకొని మూడేళ్లు అయినా ఇండ్లు రాలేదని మరోమారు నిలదీయగా .. కొన్ని రోజలకు నకిలీ డబుల్ బెడ్ రూం ఇండ్ల పత్రాలు ఇచ్చారు. తర్వాత డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇంకా హ్యాండోవర్ చేయకపోవడంతో అనుమానం వచ్చి నిలదీయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. 

దీంతో బాధితులు ఆదిభట్ల పోలీసులను ఆశ్రయించారు. తమ దగ్గర డబ్బులు తీసుకున్నట్లు వీడియోల, ఆడియోలు , డబుల్ బెడ్ రూం ఇచ్చినట్లు తప్పుడు డాక్యుమెంట్ల సాక్ష్యాలను పోలీసులు చూపించారు.  నిందితులు కళ్లెం అంజయ్య, సునీల్ లను పోలీసులు పిలిపించి విచారించగా.. డబ్బులు తీసుకుంది నిజమే.. వారి డబ్బులు తిరిగి ఇచ్చేందుకు కొంత సమయం కావాలి బాధితులను కోరినట్లు పోలీసులకు చెప్పారు.