డికాక్‌‌‌‌ షో..వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో వరుసగా రెండో సెంచరీ

డికాక్‌‌‌‌ షో..వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో వరుసగా రెండో సెంచరీ
  •     134 రన్స్‌‌‌‌ తేడాతో సౌతాఫ్రికా గెలుపు
  •     రెండో మ్యాచ్‌‌‌‌లోనూ ఓడిన ఆస్ట్రేలియా

లక్నో : కెరీర్‌‌‌‌లో ఆఖరి వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ఆడుతున్న ఓపెనర్‌‌‌‌ క్వింటన్‌‌‌‌ డికాక్‌‌‌‌ (106 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌లతో 109) మెగా ఈవెంట్‌‌‌‌లో మళ్లీ దుమ్మురేపాడు. ఆస్ట్రేలియా బౌలర్లను చితక్కొడుతూ వరుసగా రెండో సెంచరీతో చెలరేగాడు. దీంతో గురువారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో సౌతాఫ్రికా 134 రన్స్‌‌‌‌ తేడాతో ఆసీస్‌‌‌‌ను చిత్తు చేసింది. టాస్‌‌‌‌ ఓడిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 311/7 స్కోరు చేసింది. మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (44 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 56) హాఫ్‌‌‌‌ సెంచరీ చేశాడు. తర్వాత ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో 177 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. లబుషేన్‌‌‌‌ (46) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. డికాక్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

కీలక భాగస్వామ్యం..

ఫ్లాట్‌‌‌‌ వికెట్‌‌‌‌పై డికాక్‌‌‌‌.. ఆసీస్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ను దంచాడు. దీనికితోడు కీలక టైమ్‌‌‌‌లో కంగారూలు క్యాచ్‌‌‌‌లూ డ్రాప్‌‌‌‌ చేసి మూల్యం చెల్లించుకున్నారు. 4, 5 ఓవర్లలో ఫోర్‌‌‌‌, సిక్స్‌‌‌‌తో టచ్‌‌‌‌లోకి వచ్చిన డికాక్‌‌‌‌ తర్వాత కూడా బౌండ్రీల వర్షం కురిపించాడు. రెండో ఎండ్‌‌‌‌లో బావుమా (35) సింగిల్స్‌‌‌‌ తీయడంతో పవర్‌‌‌‌ప్లేలో సౌతాఫ్రికా 53/0 స్కోరు చేసింది. ఫీల్డింగ్‌‌‌‌ పెరిగిన తర్వాత కమిన్స్‌‌‌‌, జంపా ఓవర్లలో ఫైన్‌‌‌‌ లెగ్‌‌‌‌, కవర్స్‌‌‌‌లో సిక్స్‌‌‌‌, ఫోర్‌‌‌‌ కొట్టిన డికాక్‌‌‌‌ 51 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ అందుకున్నాడు. అప్పటికే రెండుసార్లు క్యాచ్‌‌‌‌ ఔట్‌‌‌‌ నుంచి బయటపడ్డ బావుమా కూడా బ్యాట్‌‌‌‌ ఝుళిపించడంతో 18 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు100/0కు చేరింది. అయితే 20వ ఓవర్‌‌‌‌లో మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ (2/34)  బౌలింగ్​లో బావుమా ఔట్​ కావడంతో తొలి వికెట్‌‌‌‌కు 108 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది.

డుసెన్‌‌‌‌ (26) కాస్త టైమ్‌‌‌‌ తీసుకున్నా.. డికాక్‌‌‌‌ 23వ ఓవర్‌‌‌‌లో బ్యాక్‌‌‌‌ టు బ్యాక్‌‌‌‌ సిక్సర్లతో రెచ్చిపోయాడు. 29వ ఓవర్‌‌‌‌లో జంపా.. డుసెన్‌‌‌‌ను ఔట్ చేయడంతో రెండో వికెట్‌‌‌‌కు 50 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. ఇక 94 రన్స్‌‌‌‌ వద్ద కమిన్స్‌‌‌‌ వేసిన షార్ట్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌ బాల్‌‌‌‌ను ఫుల్‌‌‌‌ షాట్‌‌‌‌ సిక్సర్‌‌‌‌గా మలిచిన డికాక్‌‌‌‌ 91 బాల్స్‌‌‌‌లో సెంచరీ అందుకున్నాడు. ఒక్క రన్‌‌‌‌ వద్ద మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ ఇచ్చిన క్యాచ్‌‌‌‌ను కమిన్స్‌‌‌‌ డ్రాప్‌‌‌‌ చేశాడు. ఆ వెంటనే మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ మళ్లీ దెబ్బకొట్టాడు.

అతని బౌలింగ్‌‌‌‌లో రివర్స్‌‌‌‌ స్వీప్‌‌‌‌ ఆడబోయి డికాక్‌‌‌‌ క్లీన్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ అయ్యాడు. దీంతో మూడో వికెట్‌‌‌‌కు 39 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ అయ్యింది. హాఫ్‌‌‌‌ సెంచరీ పూర్తి చేసిన మార్‌‌‌‌క్రమ్‌‌‌‌..  క్లాసెన్‌‌‌‌ (29)తో నాలుగో వికెట్‌‌‌‌కు 66 రన్స్‌‌‌‌ జత చేసి ఔటయ్యాడు. వీరిద్దరు నాలుగు రన్స్ తేడాతో ఔటయ్యారు. చివర్లో మిల్లర్‌‌‌‌ (17), జెన్‌‌‌‌సెన్‌‌‌‌ (26) ఆరో వికెట్‌‌‌‌కు 43 రన్స్‌‌‌‌ జోడించడంతో ప్రొటీస్‌‌‌‌ మంచి టార్గెట్‌‌‌‌ను నిర్దేశించింది. 

బౌలింగ్‌‌‌‌ సూపర్‌‌‌‌

ఛేజింగ్‌‌‌‌లో ఆస్ట్రేలియాను కట్టడి చేయడంలో సౌతాఫ్రికా బౌలర్లు సూపర్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ అయ్యారు. రబాడ (3/33)కు తోడు జెన్‌‌‌‌సెన్‌‌‌‌ (2/54), కేశవ్‌‌‌‌ మహారాజ్‌‌‌‌ (2/30), శంషీ (2/38) సమష్టిగా చెలరేగడంతో ఆసీస్‌‌‌‌ బ్యాటర్లు వరుస విరామాల్లో పెవిలియన్‌‌‌‌కు క్యూ కట్టారు. ఓపెనింగ్‌‌‌‌లో మిచెల్‌‌‌‌ మార్ష్‌‌‌‌ (7), వార్నర్‌‌‌‌ (13)కు తోడు స్మిత్‌‌‌‌ (19), ఇంగ్లిస్‌‌‌‌ (5), మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ (3), స్టోయినిస్‌‌‌‌ (5) నిరాశపర్చడంతో ఆసీస్‌‌‌‌ 70 రన్స్‌‌‌‌కే 6 వికెట్లు కోల్పోయి ఎదురీత మొదలుపెట్టింది.

ఈ దశలో లబుషేన్‌‌‌‌, మిచెల్‌‌‌‌ స్టార్క్‌‌‌‌ (27) ఏడో వికెట్‌‌‌‌కు 69 రన్స్‌‌‌‌ జత చేసి ఇన్నింగ్స్‌‌‌‌ను కుదుటపర్చారు. తర్వాత కమిన్స్‌‌‌‌ (22), జంపా (11 నాటౌట్‌‌‌‌) 9వ వికెట్‌‌‌‌కు 32 రన్స్‌‌‌‌ జోడించినా మరో 9.1 ఓవర్లు మిగిలి ఉండగానే ఆసీస్‌‌‌‌ ఆలౌటైంది.  

సంక్షిప్త స్కోర్లు

సౌతాఫ్రికా : 50 ఓవర్లలో 311/7 (డికాక్‌‌‌‌‌‌‌‌ 109, మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ 56, మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌ 2/34). ఆస్ట్రేలియా: 40.5 ఓవర్లలో 177 ఆలౌట్‌‌‌‌ (లబుషేన్‌‌‌‌ 46, స్టార్క్‌‌‌‌ 27, కమిన్స్‌‌‌‌ 22, రబాడ 3/33).