హైదరాబాద్ లో అడ్డంగా బుక్కైన నకిలీ పోలీస్ ముఠా.. తుపాకులు, పోలీస్ కార్లు స్వాధీనం!

హైదరాబాద్ లో  అడ్డంగా బుక్కైన నకిలీ  పోలీస్ ముఠా.. తుపాకులు, పోలీస్ కార్లు స్వాధీనం!

అధికారుల కళ్లు గప్పి.. పోలీసుల పేరిట చలామణి అవుతూ, అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఒక ఘరానా నకిలీ పోలీస్ ముఠా గుట్టు రట్టయింది. కూకట్‌పల్లి సీసీఎస్, జగద్గిరిగుట్ట పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో ఈ ముఠా అడ్డంగా బుక్కైంది. 

 కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి  చెప్పిన వివరాల ప్రకారం..  కూకట్‌పల్లికి చెందిన పూర్ణచందర్ రావు అనే వ్యక్తిపై గతంలో హర్యానాలో ఉన్న ఒక కేసును సాకుగా చూపి, ఈ సూడో పోలీసులు భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుల నెట్‌వర్క్‌ను చేధించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నాగరాజు రఘువర్మ అనే ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ప్రధాన నిందితుడు రఘువర్మ సామాన్యుడు కాదు.. గతంలో ఇతనిపై రెండు సార్లు పీడీ యాక్ట్ కూడా నమోదైంది. అయినా సరే బుద్ధి మార్చుకోకుండా, గత కొన్నేళ్లుగా పోలీసుల కళ్లు గప్పి నకిలీ పోలీస్‌గా చలామణి అవుతూ పలు నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుండి.. పోలీస్ స్టిక్కర్లు ఉన్న రెండు కార్లు, ఒక దేశీయ తుపాకీ, ఒక ఎయిర్ గన్‌తో పాటు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వాడే పలు కీలక సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ఉన్న మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.