IPL వేలంలో ఆ ఆల్ రౌండర్ జాక్ పాట్ కొట్టడం ఖాయం: ఆక్షన్‎కు ముందే అశ్విన్ జోస్యం

IPL వేలంలో ఆ ఆల్ రౌండర్ జాక్ పాట్ కొట్టడం ఖాయం: ఆక్షన్‎కు ముందే అశ్విన్ జోస్యం

న్యూఢిల్లీ: ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2026 సీజన్ కోసం వేలానికి రంగం సిద్ధమైంది. 2025, డిసెంబర్ 16న ఆక్షన్ జరగనుంది.  కామోరూన్ గ్రీన్, లివింగ్ స్టోన్, స్టీవ్ స్మిత్, డేవిడ్ మిల్లర్ వంటి స్టార్ ప్లేయర్స్ వేలంలోకి వచ్చారు. దీంతో ఐపీఎల్ ఆక్షన్‎పై ఉత్కంఠ నెలకొంది. వేలంలో ఏ ప్లేయర్ జాక్ పాట్ కొడతాడు..? ఏ ఆటగాడిని ఏ ఫ్రాంచైజ్ దక్కించుకుంటుందనే ఆసక్తి క్రికెట్ ప్రియుల్లో నెలకొంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్ర అశ్విన్ ఐపీఎల్ వేలంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

వేలంలో ఏ ఆటగాడు జాక్ పాట్ కొడతాడో జోస్యం చెప్పారు. ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామోరూన్ గ్రీన్ ఆక్షన్‎లో జాక్ పాట్ కొట్టడం ఖాయమని అశ్విన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మాక్స్‎వెల్, రస్సెల్, డుప్లెసిస్ వంటి స్టార్ ప్లేయర్స్ ఐపీఎల్ వేలానికి దూరంగా ఉండటంతో గ్రీన్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడతాయని.. అతడిపై కాసుల వర్షం కురవడం ఖాయమని పేర్కొన్నాడు. వేలానికి ముందే సిడ్నీ హార్బర్ దగ్గర 4-5 ఎకరాలు బుక్ చేసుకోమని గ్రీన్‏కు చెప్పండని అశ్విన్ చమత్కరించారు.

కామెరాన్ గ్రీన్ ఐపీఎల్ హిస్టరీ:

ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ ఐపీఎల్‎లో ఆర్సీబీ, ముంబై ఫ్రాంచైజీలు తరుఫున ప్రాతినిథ్యం వహించాడు. క్యాచ్ రిచ్ లీగులో ఇప్పటి వరకు 29 మ్యాచులు ఆడిన గ్రీన్ ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో సహా 41.5 సగటుతో 707 పరుగులు చేశాడు. ఫాస్ట్ బౌలింగ్‎తో పాటు టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న గ్రీన్ వెన్నుముక గాయం కారణంగా 2025 ఐపీఎల్ సీజన్‎కు దూరమయ్యాడు. 

గాయం కారణంగా టోర్నీకి అందుబాటులో ఉండకపోవడంతో ఆర్సీబీ అతడిని రిటైన్ చేసుకోలేదు. గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన ఈ ఆల్ రౌండర్ ఈ ఏడాది ఆసీస్ తరుఫున దుమ్మురేపుతున్నాడు. ఈ సంవత్సరం ఆడిన ఎనిమిది T20I లలో 169 స్ట్రైక్ రేట్‌తో సగటున 43 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ వేలానికి కూడా తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు.

దీంతో ఈ స్టార్ ఆల్ రౌండర్‎పై ప్రాంఛైజీలు కన్నేశాయి. వేలంలో అధిక డిమాండ్ ఉన్న ప్లేయర్ల జాబితాలో గ్రీన్ ముందు వరుసలో ఉన్నాడు. దీంతో ఐపీఎల్ 2026 వేలంలో గ్రీన్ జాక్ పాట్ కొట్టే అవకాశం ఉంది. టీమిండియా మాజీ స్పిన్నర్ అశ్విన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మరీ వేలంలో గ్రీన్ జాక్ పాట్ కొడతాడా లేదా తెలియాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే..!