రోహిత్ గొప్ప వ్యక్తిత్వం కలవాడు..ఆ సమయంలో నన్ను అర్ధం చేసుకున్నాడు: అశ్విన్

రోహిత్ గొప్ప వ్యక్తిత్వం కలవాడు..ఆ సమయంలో నన్ను అర్ధం చేసుకున్నాడు: అశ్విన్

రాజ్ కోట్ టెస్టులో  500 వికెట్లు తీసుకొని అరుదైన ఘనత సాధించిన రవి చంద్రన్ అశ్విన్ కు అదే రోజు ఊహించని షాక్ తగిలింది. తన తల్లి చిత్రా అశ్విన్ అనారోగ్య కారణంగా హాస్పిటల్ లో చేరడంతో రెండో రోజు వెంటనే పుజారా సహాయంతో స్పెషల్ ఫ్లయిట్ లో  చెన్నై చేరుకున్నాడు. ఆ మరుసటి రోజే బీసీసీఐ సహాయంతో రాజ్ కోట్ చేరుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనకు చేసిన సహాయం గురించి చెప్పుకొచ్చాడు.       

“నా తల్లికి హాస్పిటల్ లో ఉందని తెలిసి చెన్నైకి ఎలా చేరుకోవాలో నాకు అర్ధం కాలేదు. ఒక్కడిని గదిలో కూర్చొని ఏడుస్తున్నాను. ఈ సమయంలో రోహిత్, ద్రవిడ్ నన్ను కలవడానికి వచ్చారు. వారు నా బ్యాగ్‌లను ప్యాక్ చేయమని చెప్పారు. ఆ సమయంలో నా తల్లితో ఉండటమే ముఖ్యమని రోహిత్ నాకు చెప్పాడు. నా కోసం ఛార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేస్తానని రోహిత్ అన్నాడు. 

మా టీమ్ ఫిజియో కమలేష్ నాకు మంచి స్నేహితుడు. నేను విమానాశ్రయానికి బయలుదేరడానికి బయటకు వెళ్లినప్పుడు కమలేష్ నాతో వచ్చాడు. రోహిత్ ప్రయాణంలో నా గురించి తెలుసుకోవడానికి కమలేష్‌కి ఫోన్ చేసేవాడు. నా యోగక్షేమాలు తెలుసుకోవడానికి కమలేష్‌కి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఈ గొప్ప లక్షణం కొందరిలోనే ఉంటుంది. నేను రోహిత్ లో చూశాను. అతను గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. కెప్టెన్ గా రోహిత్ ఏదైనా పెద్ద విజయం సాధించాలని దేవుడిని ప్రార్థిస్తాను". అని అశ్విన్ అన్నాడు.