నిరుద్యోగుల పోరాటంతోనే టెట్​ నోటిఫికేషన్ : ఆర్.కృష్ణయ్య

నిరుద్యోగుల పోరాటంతోనే టెట్​ నోటిఫికేషన్ : ఆర్.కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు : నిరుద్యోగుల పోరాట ఫలితమే టెట్​ నోటిఫికేషన్​అని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ రిపోర్టు ఆధారంగా 24 వేల టీచర్​పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. 11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. శుక్రవారం కాచిగూడలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యకుడు నీల వెంకటేశ్​ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 25 వేల టీచర్ ​పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయన్నారు.

టీచర్లు లేకుండా గవర్నమెంట్​స్కూళ్లు ఎలా నడుపుతారని నిలదీశారు. ప్రస్తుతం ఎంత మంది టీచర్లు ఉన్నారో.. ఎంత మంది ప్రమోషన్లు పొందారో.. రిటైర్ అయినవారి సంఖ్యతో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. టీచర్లు లేకనే చాలా స్కూళ్లు మూతబడ్డాయని వాపోయారు. సీఎం రేవంత్​రెడ్డి ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నాయకులు సుధాకర్, రామకృష్ణ, రాజ్ కుమార్, నందగోపాల్, ప్రభుగౌడ్, కృష్ణయాదవ్, జి.అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.