రిజర్వేషన్ల బిల్లు పెట్టకపోతే  ఈసారి యుద్ధమే

రిజర్వేషన్ల బిల్లు పెట్టకపోతే  ఈసారి యుద్ధమే

హైదరాబాద్, వెలుగు: దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు పెట్టకపోతే యుద్ధమే జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఆదివారం కాచిగూడలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో బీసీలను దిక్కులేని వారిని చేశారని, పేరుకే ప్రజాస్వామ్యం కానీ, మెజారిటీ ప్రజలకు ఏ రంగంలోనూ వాటా ఇవ్వకుండా అన్యాయం చేశారని విమర్శించారు. అందుకే బీసీలు తెగించి పోరాడాలని పిలుపునిచ్చారు. రాజస్థాన్ గుజ్జర్లు, గుజరాత్ పటేళ్లు, హర్యానాలో జాట్లు చేసినట్లు పోరాటం చేయాలన్నారు. ఈసారి పోరాడకపోతే బీసీలకు, వారి పిల్లలకు భవిష్యత్తు ఉండదన్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు అఖిల పక్షంతో ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి పార్లమెంట్​లో బీసీ బిల్లు పెట్టించాలని కోరారు. తెలుగు రాష్ట్రాల చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని తీర్మానం చేశారు.