విద్యార్థుల మెస్ చార్జీలు, స్కాలర్ షిప్​లు పెంచాలి: ఆర్ కృష్ణయ్య

విద్యార్థుల మెస్ చార్జీలు, స్కాలర్ షిప్​లు పెంచాలి: ఆర్ కృష్ణయ్య

మెహిదీపట్నం, వెలుగు:  రాష్ట్రంలోని 8 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల మెస్ చార్జీలు, స్కాలర్ షిప్ లు  పెంచాలని,  రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం  దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ ను ముట్టడించి వంటావార్పు చేపట్టారు.  విద్యార్థులు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంత మంతా కిక్కిరిసిపోయింది.  ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఆరేండ్ల కిందట నిర్ణయించిన ధరలనే మెస్ చార్జీలు, స్కాలర్ షిప్ లుగా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.  

నిత్యావసరాల ధరలు రెండు, -మూడు రెట్లు పెరిగాయని తెలిపారు. దీంతో విద్యార్థులకు క్వాలిటీ లేని ఫుడ్ అందిస్తున్నారని, కమిషనర్లు  హాస్టళ్లను సందర్శించి విద్యార్థుల ఇబ్బందులు తెలుసుకోవడంలేదని మండిపడ్డారు. 2014లో  ప్రభుత్వం పూర్తి ఫీజుల స్కీమును నిర్వీర్యం చేస్తూ.. జీవో జారీ చేసిందని.. దీంతో  పెంచిన ఫీజులు కట్టలేక పేద విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ముట్టడిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నేతలు సుధాకర్,  నీల వెంకటేష్, బొజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.