బీసీలను నమ్మించి మోసం చేసిన్రు : ఆర్ కృష్ణయ్య

బీసీలను నమ్మించి మోసం చేసిన్రు : ఆర్ కృష్ణయ్య
  • ఇక కాంగ్రెస్ ప్రభుత్వ భరతం పడతం: ఆర్ కృష్ణయ్య 
  • బీసీ భవన్​లో సామూహిక నిరాహార దీక్ష

ముషీరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు. నమ్మించి మోసం చేసిన సర్కారు భరతం పడతామని హెచ్చరించారు. 46 జీవోను వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామన్నారు. బుధవారం విద్యానగర్ బీసీ భవన్​లో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి, బీసీ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు పాలూరి రామకృష్ణయ్య, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్, జాతీయ కన్వీనర్ గుజ్జ సత్యం పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడారు. జీవో 46 కారణంగా సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా, మండలం, గ్రామాల్లో బీసీలకు ఒక్క సర్పంచ్ స్థానాన్ని కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ మోసాన్ని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చామని తెలిపారు. ఈ నెల 29న రహదారుల దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.

 బీఆర్ఎస్​ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ.. రిజర్వేషన్లు సాధించేవరకు విశ్రాంతి తీసుకోమని.. అందుకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని చెప్పారు. సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. రిజర్వేషన్లు ప్రకటించకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించడం కరెక్ట్  కాదన్నారు. వకుళాభరణం కృష్ణ మోహన్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల్లో హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఇవ్వలేమని చేతులు ఎత్తివేయడం దుర్మార్గమన్నారు.