బీసీ బిల్లు కోసం రేపు పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన

బీసీ బిల్లు కోసం రేపు పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన
  • ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: బీసీ బిల్లు కోసం ఈ నెల 21న పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన చేపడుతున్న ట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. పార్లమెంట్​లో బీసీ బిల్లు పెట్టి.. చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పా టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం విద్యా నగర్ లోని బీసీ భవన్ లో 16 బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు. 75 ఏండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించకుండా అన్యాయం చేస్తు న్నాయని మండిపడ్డారు. 

దీంతో  బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. బీసీలకు చెందవలసిన సంపద, అధికారం దక్కకుండా పోయిందన్నారు. ఏ రంగంలో చూసినా బీసీల ప్రాతినిథ్యం 14% దాటలేదని, ఓటు బ్యాంకుకే తప్ప.. రాజ్యాధికారంలో అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. 

బీసీలకు జనాభా ప్రకారం రావాల్సిన వాటా ఇవ్వాల్సిన ఆవశ్యకతను తెలుపుతూ 16 బీసీ సంఘాలతో ఈ నెల 21 నుంచి ఆగస్టు 8 వరకు ఢిల్లీలో ఉద్యమాలు, నిరసనలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, జిల్లపల్లి అంజి, కొల్లి నాగేశ్వరరావు, అనంతయ్య, నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు.