
ముషీరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై హైకోర్టు ఇచ్చిన స్టేను వ్యతిరేకిస్తూ 14న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చామని ఎంపీ ఆర్. కృష్ణయ్య తెలిపారు. శనివారం ఆయన బీసీ సంఘాలతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి బీసీ బంద్ చేపట్టనున్నట్లు తెలిపారు.
దీనికి మద్దతు ఇవ్వాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బీసీల రిజర్వేషన్లకు ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. రిజర్వేషన్లపై స్టే రావడం చాలా బాధాకరమని, ఎంతో ఆశతో ఎదురుచూసిన బీసీ సమాజానికి నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితిలో బీసీలకు రిజర్వేషన్లు సాధించి తీరుతామని స్పష్టం చేశారు.