- బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి మార్చుకోవాలి: ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 46 జీవోను సవరించాలని బీసీ కమిషన్ చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. న్యాయబద్ధ సంస్థ అయిన బీసీ కమిషన్ సూచనలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ జేఏసీ నాయకులు అంజి, మోడీ రాందేవ్ నేతృతంలో లోయర్ ట్యాంక్ బండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి ఆర్.కృష్ణయ్య, మధుసూదనాచారి, వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, జాతీయ ఆర్డినేటర్ డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్, హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం మొదట తెచ్చిన జీవో 9పై స్టే కొనసాగుతున్నప్పుడు మరో జీవో ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. జీవో 46ను రద్దు చేసి , బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుందని నిలదీశారు. బీసీల ఆత్మగౌరానికి భంగం కలిగినప్పుడు చిన్నచూపు చూసిన ప్రభుత్వం గద్దె దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నిరసన ర్యాలీలో బీసీ నాయకులు రాజ్ కుమార్, నీల వెంకటేశ్, గుజ్జ సత్యం, అనంతయ్య, అజయ్, భీమ్ రాజ్, వేణుమాధవ్, ఆశిశ్ గౌడ్, నిఖిల్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
