- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య
బషీర్‌బాగ్, వెలుగు: ఎన్నో ఏండ్ల పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జీవో నెం.7ను వెంటనే రద్దు చేసి, పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఖాతాల్లోకి నగదు జమ చేయడం సరికాదని, దీనివల్ల విద్యావ్యవస్థలో గందరగోళం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం వెంటనే అప్పీల్‌కు వెళ్లాలని కోరారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే జూన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కృష్ణయ్య తెలిపారు.
సుమారు 5 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులతో సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా ఉన్నారని, ఆయన తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామనడం సరికాదని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. జన గణనతో పాటు కుల గణన చేపడుతున్నారని, త్వరలోనే జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాని స్థాయిని మరిచి విమర్శలు చేసే వారు తమ పద్ధతిని మార్చుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నేతలు జిల్లపల్లి అంజి, సి.రాజేందర్, జి. అనంతయ్య, గొరిగే మల్లేష్, సదానందం, శివ కుమార్ గౌడ్, పృథ్వి, చంద్రశేఖర్, సుమిత్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
