ఆదిలాబాద్ లో డైనోసర్.. దానికి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు

ఆదిలాబాద్ లో డైనోసర్.. దానికి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు

54 అడుగుల ఎత్తు.. 7 వేల కిలోల బరువు ఉన్న రాక్షస బల్లి (డైనోసర్). ఒకప్పుడు మన ఆదిలాబాద్ ప్రాంతంలోనే తిరిగిందని తెలుసా? చరిత్రలో వందల వేల ఏళ్ల క్రితం సంచరించి కాలగర్భంలో కలిసిపోయాయి ఈ భారీ జీవులు. వాటి ఆనవాళ్లు ఇక్కడ దొరికాయని ఐఎఫ్ఎస్ అధికారి ఒకరు తెలిపారు. అది కూడా ఇప్పడు కాదు. 1960లోనే పూర్తి స్థాయి డైనోసర్ అస్థిపంజరం ఆదిలాబాద్ లో జిల్లాలో జరిపిన తవ్వకాల్లో లభించింది.

డైనోసర్ కు జాతీయ గీతం రచించిన ఠాగూర్ పేరు

ఎవరికీ ఊహకందనంత గొప్ప హిస్టరీ భారత్ సొంతం అని ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెన్ సర్వీసెస్) అధికారి పర్వీన్ కశ్వాన్ ట్వీట్ చేశారు. భారత్ లో తొలిసారి డైనోసర్ ఆనవాలు 1828లోనే లభించాయని ఆయన తెలిపారు. దాన్ని కోల్ కతాకు, అక్కడి నుంచి బ్రిటిషర్లు లండన్ కు తరలించారని చెప్పారు. అయితే 1960లో ఆదిలాబాద్ లో తొలిసారి డైనోసర్ పూర్తి స్థాయి అస్థిపంజరం దొరికిందన్నారు. దీనికి మన జాతీయ గీతం రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు పెట్టారని పర్వీన్ చెప్పారు. బరపసౌరస్ ఠాగూరీ అని దానికి నామకరణం చేసినట్లు తన ట్వీట్ లో వివరించారు.

ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ విషయం అందరికీ తెలియజేసినందుకు థ్యాంక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.