- ఓ యువతా ఆలోచించు.. ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మిద్దాం
- ట్విట్టర్(ఎక్స్)లో రాచకొండ పోలీసుల పిలుపు
- ఆత్మహత్యల నివారణపై వీడియో వైరల్
సికింద్రాబాద్, వెలుగు: “ ఓ యువతా.. ఒక్క క్షణం ఆలోచించండి.. ఆత్మహత్యలు చేసుకోకండి.. తల్లిదండ్రులకు, స్నేహితులు, బంధువులకు క్షోభను మిగల్చకండి.. అంటూ యువతలో అవగాహన కల్పించేందుకు రాచకొండ కమిషనరేట్ పోలీసులు దృష్టి పెట్టారు. జీవితం విలువేంటో తెలియజెప్పేందుకు.. క్షణికావేశంలో చేసుకునే ఆత్మహత్యలను నివారించేందుకు, ఆత్మస్థైర్యాన్ని నింపే లక్ష్యంతో ట్విట్టర్ (ఎక్స్)లో ఆదివారం 50 సెకండ్ల వీడియోను రాచకొండ పోలీసులు రిలీజ్ చేశారు. “ ఓ యువతా.. మీ తల్లిదండ్రులు తిట్టారనో.. ఫోన్ కొనివ్వలేదనో.. లవ్ఫెయిల్యూర్అయిందనో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో.. ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో మంచి ర్యాంకు రాలేదనో.. ఇలాంటి చిన్న కారణాలతో డిప్రెషన్ ను లోనై.. అనాలోచితంగా ఆత్మహత్యలకు పాల్పడొదు.. ఈ దేశానికి నువ్వే వెన్నెముక.. ఆలోచించండి.. అనుకున్నది సాధించండి.. రండి.. ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మిద్దాం.. అంటూ వీడియోలో పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం ట్విట్టర్ లో పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
