- కెమెరాకు చిక్కిన అపరిచితుడి విద్వేషపూరిత వ్యాఖ్యలు..
- సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికాలో భారతీయ దంపతులపై జాత్యహంకార దాడికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ క్లిప్‌లో, కారులో కూర్చున్న ఒక అపరిచితుడు ఆ దంపతులను, ‘మీరు భారతదేశానికి చెందినవారా?’ అని అడిగి, ఆ తర్వాత వారిని దేశం విడిచి వెళ్లమని దూషించాడు.
ఈ వీడియో జాత్యహంకారం, విదేశీయుల పట్ల ద్వేషం, విదేశాలలో వలసదారుల అనుభవాల చుట్టూ ఉన్న చర్చలను తిరిగి రాజేసింది. వీడియోలో, ఆ అపరిచితుడు అమెరికా కంటే భారతదేశం మంచిదా అని ప్రశ్నించాడు. పరిస్థితిని తీవ్రతరం చేయకూడదనే ఉద్దేశంతో రెండు దేశాలు మంచివేనని సమాధానమిచ్చాడు. తమ కుటుంబం భారతదేశంలో నివసిస్తుందని చెప్పగా అమెరికాలో ఎందుకు ఉన్నారని ఆ వ్యక్తి ప్రశ్నించాడు.
తాము "ప్రపంచాన్ని అన్వేషించడానికి" ఈ దేశానికి వచ్చామని ఆ జంట వివరించినప్పుడు, ఆ అపరిచితుడు మరింత దూకుడుగా స్పందించాడు. "లేదు, మీరు ఇక్కడ ఉండటం మాకు ఇష్టం లేదు. మీరు ఇంటికి తిరిగి వెళ్లాలి. నా దేశం నుంచి వెళ్లిపోండి" అని విద్వేషపూరితంగా వ్యాఖ్యానించాడు.
ఈ దాడి జరిగినప్పటికీ ఆ దంపతులు ఎంతో సంయమనం పాటించారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు ఆ జంట హుందాతనాన్ని కొనియాడగా, మరికొందరు ఇలాంటి సమయాల్లో మౌనంగా ఉండటం జాత్యహంకారాన్ని ప్రోత్సహిస్తుందని వాదించారు.
