ఇన్ స్పిరేషన్.. కాగితపు గాజు బొమ్మ

ఇన్ స్పిరేషన్.. కాగితపు గాజు బొమ్మ

మనలో కొందరు ‘అది లేదు, ఇది లేదం’టూ ఎప్పుడూ ఏదో ఒక నిరాశతో జీవితాన్ని భారంగా గడిపేస్తుంటారు. అలాంటి వాళ్లు రాధిక జేఏ గురించి తప్పక తెలుసుకోవాలి. తోటి వాళ్లను చూసి ‘నా జీవితం ఇంతేనా!’ అని బాధపడిన ఆ అమ్మాయే ఇప్పుడు ఎంట్రప్రెనూర్​గా మారింది.

తమిళనాడుకి చెందిన రాధికది కోయంబత్తూరు​ శివారులోని భారతీపురం అనే చిన్న ఊరు. ఆమెకు చిన్నప్పుడే ఎముకలు పెళుసు బారే వ్యాధి ఉన్నట్టు తెలిసింది. ఈ జబ్బు ఉన్న వాళ్లు ఒక్కోసారి ఒక్క అడుగు వేసినా, ఏ పనీ చేయకపోయినా ఎముకలు విరిగిపోతాయి లేదా చిట్లిపోతాయి. ‘‘ఐదేళ్ల వయసులో మొదటి ఫ్రాక్చర్​ అయింది. కాలికి అయిన ఆ ఫ్రాక్చర్​కి సర్జరీ అవసరం పడింది. సర్జరీ తరువాత మూడు నెలలు బెడ్​ రెస్ట్​ అన్నారు డాక్టర్లు. దాని తరువాత తొమ్మిది నెలల్లోపే అదేకాలికి మరో ఫ్రాక్చర్​ అయింది. ఆ తరువాత ఏడాదికి మరో కాలు ఫ్రాక్చర్​. అలా పన్నెండేళ్లు వచ్చేసరికి పది సర్జరీలు అయ్యాయి. నాకున్న జబ్బు పేరు ఆస్టియోజెనెసిస్​ ఇంపర్ఫెక్టా లేదా బ్రిటిల్​ బోన్​ డిసీజ్.

ఇది  జన్యుపరంగా​​ లేదా వారసత్వంగా వచ్చే అరుదైన జబ్బు. కొందరిలో మైల్డ్​గా మరికొందరిలో తీవ్రంగా ఉంటుంది. ఆ తీవ్రత ఎంతగా ఉంటుందంటే దీని బారిన పడిన పేషెంట్​కి కదలడం కూడా కష్టం అవుతుంది. వాకర్​ లేదా వీల్​ చెయిర్​ వాడాల్సిన పరిస్థితి ఉండే ఈ జబ్బు నయం కాదు.

బాల్యమంతా​ లాక్​డౌన్​

కొవిడ్​ లాక్​డౌన్​ టైంలో ఇంట్లో ఉండడం అనేది చాలామందిలో యాంగ్జైటీని పెంచింది. అలాంటిది నా బాల్యమంతా లాక్​డౌన్ స్టేజ్​లోనే గడిచింది​. ఎక్కువసేపు కూర్చునే ఉండడం వల్ల వెన్నెముక వంగిపోయింది. దానికోసం మరో సర్జరీ చేశారు. నడవాలంటే భయం వేసేది. అడుగు వేస్తే ఏ ఎముక విరుగుతుందో అని టెన్షన్​. అందుకే నాలుగో తరగతిలోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. రోజంతా బెడ్​మీద కూర్చుని ఉండేదాన్ని. మాట్లాడేందుకు ఒక్క ఫ్రెండ్​ కూడా లేరు. నా గది కిటికీ నుంచి బయటకి చూస్తే ఆడుకుంటున్న, స్కూల్​​కి వెళ్తున్న నా ఈడు పిల్లలు కనిపించేవాళ్లు. ఆ ఏజ్​లో నాకు అవుటింగ్​ అంటే హాస్పిటల్స్​ చుట్టూ తిరగడమే. ఆ ఫీలింగ్​ నాకు డిప్రెషన్​ తెచ్చింది. దాంతో నేను ఇంట్లో ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. కారణం లేకుండానే విపరీతమైన కోపం వచ్చేది’’ అని తన గతాన్ని గుర్తుచేసుకుంది రాధిక.

నన్ను చంపేయమనేది!​

ఈ విషయం గురించి ఆమె అన్నయ్య రాజ్​మోహన్​ మాట్లాడుతూ ‘‘ఆపరేషన్​ థియేటర్​కు వెళ్లే ప్రతిసారి మా నాన్నతో ‘‘నన్ను చంపేయండి. ఒకేసారి చనిపోయేలా మెడిసిన్ ఏదైనా ఇవ్వమ’’ని ఏడ్చేది. మాకు అది చాలా కష్టంగా అనిపించేది. ఒక్కో సర్జరీకి 35,000 రూపాయలు ఖర్చయ్యేది. అది మా నాన్న ఒక ఏడాది జీతం. నాన్న టెక్స్​టైల్​ మిల్లులో సూపర్​వైజర్​గా పనిచేసేవారు. రాధిక రెండు కాళ్లలో మొత్తం నాలుగు మెటల్​ ప్లేట్స్​ను లెగ్​ బోన్స్​కు స్క్రూలతో అటాచ్​ చేశారు. ఆ సర్జరీల తరువాత పన్నెండో తరగతి వరకు రాధికకు హోం స్కూలింగ్ ఏర్పాటుచేశాం. నిజానికి రాధికకు స్కూల్​కి వెళ్లాలి. స్కూల్​ లైఫ్​ ఎలా ఉంటుందో చూడాలనే ఆశ. అయితే కోయంబత్తూర్​లో ఉన్న స్కూల్స్​లో అడ్మిషన్​ ఇవ్వలేదు. అందుకు వాళ్లు చెప్పిన కారణం యాక్సెసబిలిటీ సరిగా లేదని” చెప్పాడు.3

 

నలుగురికీ స్ఫూర్తిగా నిలిచింది​

ఒకప్పుడు పక్కింటికి వెళ్లాలన్నా, ఒక గది నుంచి మరో గదిలోకి వెళ్లాలన్నా ఒకరి మీద ఆధారపడిన అమ్మాయి ఈ రోజున ఎంట్రప్రెనూర్​ అయింది. ‘క్వీన్​బీ పేపర్​ క్రాఫ్ట్స్​ అండ్​ క్రియేటివ్​ ఆర్ట్​’ అనే బ్రాండ్​ కింద ఎకోఫ్రెండ్లీ బొమ్మల్ని ఇండియాతో పాటు విదేశాల్లో అమ్ముతోంది. ‘‘పద్నాలుగేళ్ల వయసులో డ్రాయింగ్ వేయడం​, పెయింటింగ్​ చేయడం మొదలుపెట్టా. టీవీలో పిల్లల ప్రోగ్రామ్​ ఎమ్​ఏడీ చూసేదాన్ని. అందులో వచ్చే క్రాఫ్ట్స్​ నకలు​ చేయాలి అనుకున్నా. ఒకరకంగా అది నా జీవితంలో చాలా పెద్ద మార్పు తెచ్చింది. హ్యాండ్​ క్రాఫ్టింగ్​ బర్త్​డే కార్డ్స్​, వెడ్డింగ్​ విషెస్​ కార్డ్స్​ను పాత వివాహ ఆహ్వాన పత్రికలను అప్​సైక్లింగ్​ చేయడం మొదలుపెట్టా. ఆ పనికి ఎక్కువ సేపు, చాలా ఏకాగ్రత కావాలి. మొదట్లో రెండు నుంచి నాలుగు గంటలు ఏకబిగిన కూర్చోగలిగేదాన్ని కాదు. ఇప్పుడు కూర్చుంటా కానీ మధ్యలో బ్రేక్స్​ తీసుకుంటా. బొమ్మలు తయారుచేస్తున్నప్పుడు నాకు జబ్బు ఉందన్న విషయమే గుర్తుండదు.

మొదటి ఆర్డర్​ వచ్చిందలా

యూట్యూబ్​ వీడియోలను 2013–14 సంవత్సరాల్లో ఎక్కువగా చూసేదాన్ని. ఆ వీడియోల్లో కొత్త ఐడియాలు నేర్చుకుని, స్కెచ్​ గీసి కార్డ్స్​ తయారుచేసేదాన్ని. క్రయాన్స్​, స్కెచ్​ పెన్స్​, వాటర్​ కలర్స్​తో డ్రాయింగ్​ వేసేదాన్ని. 2016లో రాధిక సోదరుడి ఫ్రెండ్​ ఒకరు న్యూస్​పేర్​తో వాల్​ హ్యాంగింగ్​ చేసిన వీడియో చూడమని పెన్​ డ్రైవ్​లో వేసిచ్చాడు. అది ఆమెకు చాలా బాగా అనిపించింది. దాంతో వాల్​ హ్యాంగింగ్స్​ చేయడం మొదలుపెట్టింది. తయారుచేసిన వాటిని వాళ్ల ఇంట్లోనే పెట్టేవాళ్లం. వాటిని చూసిన పక్కింటి వాళ్లు, ఫ్యామిలీ ఫ్రెండ్స్​ ఆ హ్యాంగింగ్స్​ చాలా బాగున్నాయన్నారు.

అవి నేనే చేశానని తెలిసి చాలా ఆశ్చర్యపోయారు. అలాంటి వాల్​ హ్యాంగింగే చేసిమ్మని పక్కింటి ఆవిడ అడిగింది. అలా మొదటి ఆదాయం750 రూపాయలు వచ్చి హోం బిజినెస్​కు నాంది పడింది. ఆ తరువాత ఫ్యామిలీ ఫ్రెండ్స్​, ఫ్రెండ్​సర్కిల్​ నుంచి ఆర్డర్లు మొదలయ్యాయి. ఆ డబ్బుతో కావాల్సిన మెటీరియల్​ కొనుక్కుని మిగతా డబ్బుని హోం స్కూలింగ్​కి అవసరమైన పుస్తకాలు కొనుక్కునేదాన్ని.

బుక్​ ఫెయిర్​తో బిజినెస్​ మొదలు

ఆ తరువాత కొన్ని నెలలకు రాజ్​మోహన్​ ఫ్రెండ్​ ఒకతను పాత న్యూస్​ పేపర్లతో ఆఫ్రికన్​ స్టయిల్​ బొమ్మలు తయారుచేసే వీడియో తీసి యూట్యూబ్​లో పెట్టాడు. ఆ టైంలోనే నాకు కంప్యూటర్​ కొన్నారు. దానికి ఇంటర్నెట్​ కనెక్షన్​ ఇచ్చారు. దాంతో యూట్యూబ్​, పింటరెస్ట్​లో అకౌంట్​ క్రియేట్​ చేసుకున్నా. కొత్త ఐడియాలకోసం గూగుల్​లో వెతికేదాన్ని. మొదటి బొమ్మ నలుపురంగులో, స్ట్రాల్లాంటి సన్నటి చేతులతో చేశా. అది నాకు అంతగా నచ్చలేదు. కానీ అలాంటివే మరో పది బొమ్మలు వేరు వేరు కాస్ట్యూమ్స్​తో తయారుచేయమని సలహా ఇచ్చాడు నా అన్నయ్య. అలానే చేశా. ఆ టైంలోనే అంటే 2018 సంవత్సరంలో కోయంబత్తూర్​లోని కొడిస్సియా హాల్​లో బుక్​ ఫెయిర్​ ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ మా బ్రదర్​ వాళ్ల ఫ్రెండ్​ ఒకరు అప్​సైకిల్డ్​ ప్రొడక్ట్స్​ స్టాల్​ పెట్టాడు. ఆ స్టాల్​లో నేను చేసిన బొమ్మలు డిస్​ప్లేకి పెట్టమన్నాడు. మొదటి రోజు ఐదు బొమ్మలు ఇచ్చా.

తరువాతి రోజు ఇంకో ఐదు బొమ్మలు పంపమని అడిగాడు. ఆ తరువాత15 బొమ్మలు. అలా వారం రోజుల్లో మొత్తం 25 బొమ్మలను ఒక్కో బొమ్మ 150 రూపాయలకు సేల్​ చేశాడు. ఆ బుక్​ ఫెయిర్​ నా జీవితంలో టర్నింగ్ పాయింట్​. ఎందుకంటే హ్యాండ్​ మేడ్​ డాల్స్​తో మంచి బిజినెస్​ చేయొచ్చనే ఐడియా వచ్చింది అప్పుడే. ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​, లింక్డిన్​ ద్వారా బొమ్మలు సేల్​ చేయడం మొదలుపెట్టా. నాకు వచ్చిన మొదటి పెద్ద ఆర్డర్​ కూడా సోషల్​ మీడియా ద్వారానే వచ్చింది. ఊటీలో హోటల్​ ఓనర్​ ఒకరు 3.5 ఎత్తు ఉన్న 25 బొమ్మలు ఆర్డర్​ ఇచ్చారు. నేను ఊటీకి వెళ్లలేకపోయా కానీ నా బొమ్మలు ఆ హోటల్​లో డెకరేషన్​కు ఉంచడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది.

ప్రకటనలకు పైసా పెట్టలేదు

బొమ్మల అడ్వర్టైజ్​మెంట్​ కోసం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. రిఫరెన్స్​ల ద్వారా ఆర్డర్లు వచ్చాయి. దాంతోపాటు సోషల్​ మీడియాలో రెగ్యులర్​గా పోస్ట్​ చేస్తా. ఈ రోజున నేను ఇలా నిలబడగలిగాను అంటే అది నాకు ఫ్యామిలీ అందించిన సపోర్టు వల్లే. ఆర్డర్స్​ బట్టి బొమ్మలు తయారుచేయడం కాకుండా రిటెయిల్​ బిజినెస్​ చేయాలనే ఆలోచన ఉంది. గిఫ్ట్​ స్టోర్స్​, ఇంటీరియర్​ డిజైనర్స్​ ర్యాక్స్​లో నేను తయారుచేసిన బొమ్మలు ఉండాలనేది నా కల.

నమ్మకమే నిలబెడుతుంది

పక్కన ఒకరి సాయం లేకుండా నేను ఎక్కడికీ వెళ్లలేను. కానీ ఈ రోజున నా బొమ్మలు ఇండియాతో  పాటు ప్రపంచంలో ఆరు దేశాలకి వెళ్లాయి. అడుగేస్తే ఏమవుతుందో తెలియని నేనే ఇంత చేయగలుగుతున్నానంటే... ఎవరైనా తాము అనుకున్నది చేయగలుగుతారు” అంటున్న రాధిక లైఫ్​ ఎంతోమందికి ఇన్​స్పిరేషన్​. ఇంటర్మీడియెట్​ పూర్తి చేసిన ఆమె ఇప్పుడు మేనేజ్​మెంట్​ లేదా ఆర్ట్​ అండ్​ క్రాఫ్ట్స్​లో డిగ్రీ చేయాలనుకుంటోంది. కాలేజీల్లో ఆమె ఇచ్చే మోటివేషనల్​ స్పీచ్​లకు బోలెడుమంది ఫ్యాన్స్​ ఉన్నారు.

పాత పేపర్లు, కత్తెర, గమ్​, పెయింట్​తో బొమ్మలు చేసి, వాటర్​ప్రూఫ్ కోసం బొమ్మ మీద వార్నిష్​ వేస్తా. బొమ్మ షేప్​ స్ట్రాంగ్​గా ఉండేందుకు లోపల మెటాలిక్​ వైర్స్​ పెడతా. బేసిక్​ బొమ్మ తయారీకి ఒక రోజు, బొమ్మ పూర్తి కావడానికి మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది. ఈ రోజున నాకు నెలకు 30–50 బొమ్మల ఆర్డర్లు వస్తున్నాయి. అంటే నెలకు 15 వేల నుంచి 30 వేల రూపాయలు సంపాదిస్తున్నా.