టాలీవుడ్‌లో టాలెంట్ ఉండి కూడా సరైన బ్రేక్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న యువ హీరోలలో ఆది సాయికుమార్ ఒకరు. తండ్రి సాయికుమార్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది.. వరుస ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ విజయం మాత్రం దోబూచులాడుతూనే ఉంది. అయితే, 2025 ముగింపు వేళ ఆది నిరీక్షణకు తెరపడింది. ఆయన నటించిన మైథలాజికల్ థ్రిల్లర్ 'శంబాల' (Shambhala) బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకోవడమే కాకుండా, ఆది కెరీర్‌కు కొత్త ఊపిరిని పోసింది.
బాక్సాఫీస్ వద్ద 'శంబాల' ప్రభంజనం
యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన 'శంబాల' చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైంది. విడుదలైన తొలి రోజు నుంచి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. రిలీజ్ అయిన వారం రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 16.20 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సుమారు 12 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే లాభాల బాట పట్టింది. దైవ భక్తికి, దుష్ట శక్తికి మధ్య జరిగే పోరాటాన్ని 'శంబాల' గ్రామం నేపథ్యంలో అద్భుతంగా చూపించారు. ఇందులో ఆది సైంటిస్ట్ విక్రమ్‌గా తన నటనతో ఆకట్టుకోగా, శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం సినిమాకు వెన్నెముకగా నిలిచింది.
మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటించారు. రవివర్మ, మధునందన్ వంటి నటులు కీలక పాత్రల్లో మెరిశారు. పీరియడ్ డ్రామా , సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.
సాయికుమార్ సినీ ప్రస్థానానికి 'గోల్డెన్' గిఫ్ట్
ఈ విజయం ఆదికి ఎంత ముఖ్యమో, ఆయన తండ్రి, డైలాగ్ కింగ్ సాయికుమార్ కు అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే, సాయికుమార్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు (గోల్డెన్ జూబ్లీ) పూర్తయిన సందర్భంగా ఈ సక్సెస్ రావడం ఒక మధుర జ్ఞాపకం. 1975లో బాలనటుడిగా మొదలైన సాయికుమార్ ప్రస్థానం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది. తండ్రి కెరీర్ మైలురాయిని చేరుకున్న సమయంలో తనయుడు పక్కా హిట్టు కొట్టడం అటు కుటుంబంలోనూ, ఇటు అభిమానుల్లోనూ రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది.
శంబాల సక్సెస్‌తో ఆది ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టులైన 'షణ్ముఖ', 'ఇన్‌స్పెక్టర్ యుగంధర్' సినిమాలపై మరింత దృష్టి సారించారు. ముఖ్యంగా 'ఇన్‌స్పెక్టర్ యుగంధర్'లో తండ్రీకొడుకులు సాయికుమార్, ఆది కలిసి నటిస్తుండటం విశేషం.
