ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం.. ఈడీ ఛార్జ్‌షీట్‌లో రాఘవ్‌ చద్దా పేరు

ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం..  ఈడీ ఛార్జ్‌షీట్‌లో రాఘవ్‌ చద్దా పేరు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ఆమ్ ఆద్మీ పార్టీ నేత పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేర్చింది.  లిక్కర్ స్కామ్ కేసులో దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌లో ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పేరును పేర్కొంది.  ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాజీ పీఏ అరవింద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా చద్దా పేరును ఈడీ చేర్చింది. అయితే రాఘవ్ చద్దాను నిందితుడిగా ఈడీ  ఎక్కడా కూడా పేర్కొనలేదు. 

ఢిల్లీ లిక్కర్ పాలసీపై మనీష్ సిసోడియా ఇంట్లో జరిగిన సమావేశంలో రాఘవ్‌ చద్దా కూడా పాల్గొనడంతో ఈ ఛార్జ్‌షీట్‌లో ఆయన పేరును ప్రస్తావించినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో రాఘవ్‌ చద్దాతో పాటు పంజాబ్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ వరుణ్‌ రోజామ్‌, విజయ్‌ నాయర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నట్లు అరవింద్‌ దర్యాప్తు సంస్థలకు తెలిపారని సమాచారం. 

 కాగా లిక్కర్ పాలసీని రూపొందించడం , అమలు చేయడంలో అవకతవకలు జరిగాయని  ఇప్పటికే ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లను విచారించిన ఈడీ ఆరెస్ట్ చేసింది.  ఇదే కేసులో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ విచారించింది.  ఇక ఇదే చార్జిషీట్‌లో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ  ప్రస్తావించింది.