గొర్రెలు బర్రెలు తప్ప కొలువులు ఎక్కడ..? : మాధవనేని రఘునందన్​రావు

గొర్రెలు బర్రెలు తప్ప కొలువులు ఎక్కడ..? : మాధవనేని రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు: పదేళ్ల కేసీఆర్​ పాలనలో ప్రజలకు గొర్రెలు, బర్రెలు తప్పా నిరుద్యోగులకు ఒక్క కొలువు రాలేదని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్​రావు ఆరోపించారు. గురువారం మండలంలోని అచ్చుమాయపల్లి, కమ్మర్​పల్లి, ఆరేపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షా పేపర్లను రాష్ట్ర ప్రభుత్వమే లీకేజీ చేసి నిరుద్యోగులతో చెలగాటమాడుతోందన్నారు.  కౌరవుల్లా ఉన్న బీఆర్​ఎస్​ ప్రభుత్వం ముగ్గురమున్న తమ గొంతును నొక్కిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్​ చెప్పేదొకటి, చేసేదొకటని, రైతులందరికీ  ఫ్రీగా ఎరువులిస్తానని, రూ. లక్ష రుణమాఫీ చేస్తానని చెప్పి ఏదీ చేయకుండా  మోసం చేశాడని దుయ్యబట్టారు. 

ఎడమ చేత్తో పింఛన్​ ఇచ్చి  కుడి చేత్తో బెల్ట్​ షాపుల పేరుతో గుంజుకుంటున్నారని మండిపడ్డారు.  బీసీ బంధు, గృహలక్ష్మి, దళిత బంధును బీఆర్​ఎస్​ కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గం వైపు పదేళ్లుగా కన్నెత్తి చూడని ఎంపీ మనలను దోచుకున్న పైసల సంచులతో వస్తున్నాడని మండిపడ్డారు. 

రాష్ట్రంలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, మరోసారి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం బీజేపీలో చేరిన యువకులు, కార్యకర్తలకు కండువాలను కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలేష్​ గౌడ్​, మంద అనిల్​ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్​ చారీ, పార్టీ మండల అధ్యక్షుడు శివ ప్రసాద్​ గౌడ్​, వి భీషణ్​ రెడ్డి పాల్గొన్నారు.