ధనిక రాష్ట్రమే అయితే జీతాలేందుకు లేటైతున్నయ్

ధనిక రాష్ట్రమే అయితే జీతాలేందుకు లేటైతున్నయ్

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భేషుగ్గా ఉన్నట్లు మంత్రి హరీశ్​రావు మస్తు లెక్కలు చెప్తున్నారని, గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్దకు ఆయన వస్తే వాస్తవ లెక్కలు చెప్పేందుకు తాను రెడీ అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. తెలంగాణ ధనిక రాష్ట్రమే అయితే.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తారీఖున ఇవ్వాల్సిన జీతాలు ఎందుకు వారం, పది రోజులు లేటుగా ఇస్తున్నారో చెప్పాలని నిలదీశారు. కేజీబీవీ, మోడల్ స్కూళ్ల టీచర్ల జీతాలు ఎందుకు ఇస్తలేరో, జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లిస్తలేరో చెప్పాలని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో సర్పంచ్​లు సెక్యూరిటీ గార్డ్ లుగా, కూలీలుగా  ఎందుకు మారుతున్నారో.. బతకడానికి  వేరే రాష్ట్రాలకూ ఎందుకు వెళ్తున్నారో, పంచాయతీ సెక్రటరీలు, రైతులు ఎందుకు  ఆత్మహత్యలు చేసుకుంటున్నారో హరీశ్​ సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్​రావు మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో ఆర్థిక క్రమక్షణ లోపించిందని కాగ్ చెప్పింది నిజం కాదా? అసెంబ్లీ ఆమోదం లేకుండానే డబ్బు ఖర్చు చేస్తున్నారని కాగ్ తిట్టిన దాంట్లో వాస్తవం లేదా? అని హరీశ్​రావును ఆయన నిలదీశారు. అబద్ధాల పునాదులపై అభివృద్ధిని చూపించడం మానుకోవాలన్నారు. 
ఆదాయం చెప్తున్నవ్​ సరే.. అప్పు సంగతేంది? 
రాష్ట్ర తలసరి ఆదాయం చెప్పిన హరీశ్..​ రాష్ట్రానికి అప్పు ఎంత ఉందనేది ఎందుకు చెప్పలేదని రఘునందన్​రావు ప్రశ్నించారు.  ‘‘టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి బాగా ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని ఎందుకు అమలు చేస్తలేరు? ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేస్తలేదు?  తెలంగాణ ధనిక రాష్ట్రమని హరీశ్​ అంటున్నరు. ఇక్కడి మంత్రులు ధనికులే.. కానీ ప్రజలు మాత్రం పేదలు” అని అన్నారు. ‘‘బీజేపీలో కిషన్ రెడ్డి, బండి సంజయ్  గురించి మాట్లాడుతున్న హరీశ్​.. ముందు మీ కుటుంబంలోని కేటీఆర్, కవిత పంచాయితీ గురించి చెప్పాలి.  అయినా ప్రగతి భవన్​లోకి ఎంట్రీలేని హరీశ్​తో నీతులు చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేదు. ఏడాది కిందటి వరకు హరీశ్​కు ప్రభుత్వంలో ఎంత ప్రాధాన్యత దక్కిందో అందరికీ తెలుసు. దుబ్బాకలో బీజేపీ గెలిచిన తర్వాత, హుజూరాబాద్​లో ఈటల రాజీనామా చేసిన తర్వాత హరీశ్​కు కేసీఆర్ ప్రాధాన్యతనిచ్చారు. గతంలో దేశం గురించి మాట్లాడిన కవితకు నిజామాబాద్ ప్రజలు ఏ విధంగా తీర్పునిచ్చారో.. రాబోయే రోజుల్లో హరీశ్​కు కూడా సిద్దిపేటలో అదే తీర్పు ఇస్తారు” అని మండిపడ్డారు. దేశ ఆర్థిక పరిస్థితి, ఇతర దేశాల్లోని ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి గురించి హరీశ్​ ఏదో చెప్తున్నారని, అవసరమైతే ఇక్కడి మంత్రులను స్టడీ టూర్ కోసం ఇతర దేశాలకు పంపేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడుతానన్నారు. ‘‘కేంద్రం గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచిందని ప్రచారం చేస్తున్న ఈ ప్రభుత్వం.. ఇక్కడి ప్రజలపై ప్రేమ ఉంటే ఒక్కో గ్యాస్ సిలిండర్​పై ఈ ప్రభుత్వం వసూలు చేస్తున్న రూ.291 ట్యాక్స్​ను ఎత్తివేయాలి. పెట్రోల్​పై  లీటరుకు రూ.27 ట్యాక్స్​ను ఎందుకు ఎత్తేయడం లేదు.  రైల్వేల ప్రైవేటీకరణ అంటూ విమర్శలు చేసే టీఆర్ఎస్ మంత్రులు.. గజ్వేల్, సిద్దిపేట, నర్సాపూర్ కు రైల్వే లైన్ ఎవరిచ్చారో గుర్తుచేసుకోవాలి. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసిందెవరో చెప్పాలి” అని డిమాండ్​ చేశారు. డీఎస్సీని నిర్వహించలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఇది కాదా అని ఫైర్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేనివిధంగా తెలంగాణలో 170  కొత్త  వైన్స్​కు అనుమతినిచ్చారని, ఇదా అభివృద్ధి అని ఆయన ప్రశ్నించారు.